* సునీత పవర్ పాయింట్ ప్రజెంటేషన్
* వివేకా హత్యకేసులో సూత్రధారులు ఎవరో వివరణ
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : కడప మాజీ ఎంపీ, దివంగత వివేకానంద రెడ్డి హత్య కేసులో సంచలన విషయాలను ఆమె కుమార్తె సునీతా రెడ్డి బయటపెట్టారు. జస్టిస్ ఫర్ వివేకా పేరుతో.. వివేకా హత్య కేసులో సూత్రధారులు ఎవరో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. నిందితులుగా అనుమానిస్తున్న వారి కాల్ డేటా, హత్య జరిగిన రోజు వారి లొకేషన్లు ఎక్కడెక్కడ చూపిస్తున్నాయో ఆధారాలతో సహా వివరించారు. వివేకా హత్య తాలూకు ఫుటేజీలు కూడా ప్రదర్శించారు. ప్రస్తుత కడప ఎంపీ అవినాష్ రెడ్డితో నిందితులు
ఎ1 యర్ర గంగిరెడ్డి, ఏ2 యదాటిసునీల్ యాదవ్, ఏ3 గజ్జల ఉమా శంకర్ రెడ్డి, ఏ4 దస్తగిరిలకు సంబంధాలు ఉన్నాయని తెలిపారు. 2019 మార్చి 14న సునీల్‌యాదవ్ ఫోన్ లొకేషన్ అవినాష్ ఇంట్లోను, ఇంటి బయట చూపిస్తోందని అన్నారు. వాళ్లకు, అవినాష్ రెడ్డికి సంబంధాలు ఉన్నట్లు అంతా క్లియర్‌గా అర్థం అవుతోందని వివరించారు. అవినాష్ మాత్రం వీళ్లు తనకు తెలీదు అంటున్నారని, తెలియకపోతే వాళ్ల ఫోన్ లొకేషన్లు అతడి ఇంట్లో ఎందుకు చూపించాయని ప్రశ్నించారు. అదే రోజు వివేకా ఇంటి వద్ద కూడా వీరి టవర్ లొకేషన్స్ చూపిస్తున్నట్లు వెల్లడించారు. తొలుత గుండెపోటుతో వివేకా మృతి చెందినట్లు సృష్టించే ప్రయత్నం చేశారని, తర్వాత అనుమానాస్పద మృతికేసు నమోదు చేసినట్లు చెప్పారు. ఇప్పటికీ వైఎస్ వివేకాది హత్య అని పోలీసులు నిర్ధారించడం లేదని సునీత అన్నారు.
* ఒక్క అంశంలో విభేదాలుంటే..?
కుటుంబ సభ్యుల మద్య ఏదో ఒక అంశంలో విభేదాలుండడం సర్వసాధారణమైన విషయమే.. అలాగని వారి మద్య పూర్తిగా శత్రు వైఖరి ఉండే అవకాశం లేదు. ఒక్క విషయంలో నాన్నకు నాకు మద్య భేదాభిప్రాయం ఉంది. అయినప్పటికీ మా ఇద్దరి మద్య ఎంతో ఆత్మీయత ఉండేది. హైదరాబాద్‌లో అయినా పులివెందులలో అయినా మేము ఒకే ఇంట్లో ఉండే వాళ్ళమని సునిత చెప్పారు. మీ తండ్రికి ఇంకో పెళ్ళి అయింది. రెండో భార్యకు కొడుకు ఉన్నాడంటున్నారు కదా.. మీకు ఈ విషయం తెలుసా అన్న ప్రశ్నకు నాకు తెలియదు అని జవాబిచ్చారు. సుదీర్ఘంగా జరిగిన ఈ విలేకరుల సమావేశంలో అనేక విషయాలను ఆమె ప్రస్తావించారు. వాళ్ళ అన్నలు మేనత్త విమలమ్మను ఎంతో గారాభంగా చూసుకున్నారు. ఇపుడు సొంత అన్న అత్యంత దారుణంగా హత్యకు గురయితే ఏమాత్రం స్పందించకుండా నన్ను , షర్మిలను విమర్శించడం సరికాదన్నారు.
———————–