
* ఎన్నికల తనిఖీల్లో 4,650 కోట్ల సొత్తు రికవరీ
* పార్లమెంట్ హిస్టరీలో రికార్డు
* వివరాలు వెల్లడించిన ఈసీఐ
ఆకేరు న్యూస్, న్యూఢిల్లీ : పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నగదు, మద్యం, బహుమతుల పంపిణీ జరుగుతున్నట్లు స్పష్టం అవుతోంది. వాటికి ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేస్తున్న కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) ఇప్పటి వరకూ.. రూ. 4,650 కోట్ల విలువైన సొత్తు రికవరీ చేసినట్టు వివరించింది. మార్చి 1 నుంచి ఇప్పటి వరకు లెక్కేస్తే సగటున రోజుకు రూ. 100 కోట్ల మేర రికవరీ చేసినట్లు తెలుస్తోంది. పార్లమెంట్ చరిత్రలో ఇప్పటి వరకూ జరిగిన ఎన్నికల వరకు.. అత్యధిక మొత్తం రికవరీ చేసినట్లు రికార్డుల్లోకి ఎక్కింది. రికవరీ చేసిన వాటిలో.. నగదు రూపంలో రూ. 395.39 కోట్లు స్వాధీనం చేసుకోగా, బంగారం – ఇతర విలువైన లోహాల రూపంలో రూ. 562.10 కోట్లు రికవరీ చేసినట్టు ఈసీ వెల్లడించింది. అలాగే మద్యం రూపంలో రూ. 489.31 కోట్లు విలువచేసే 3.58 కోట్ల లీటర్లు స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించింది. గంజాయి నుంచి మొదలుపెట్టి కొకైన్ వరకు వివిధ రూపాల్లో ఉన్న మాదకద్రవ్యాలను కూడా ఈసీ అధికారులు భారీ మొత్తంలో స్వాధీనం చేసుకున్నారు. మొత్తం జరిగిన రికవరీల్లో రూ. 2,068.85 కోట్లు విలువ చేసే డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది.
————–