
– సెలవులను చక్కగా వినియోగించుకుంటే ఎంతో మేలు
– సరదాలతో పాటూ భవిష్యత్‌పై ఆలోచనలూ అవసరమే
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : విద్యా సంస్థలు వేసవి సెలవులకు సిద్ధమవుతున్నాయి. సెలవులు అంటే విద్యార్థులకు సరదాలు ఉండాల్సిందే. అయితే, పూర్తిగా దానికే కేటాయిస్తే కొత్త అంశాలను నేర్చుకునే అవకాశాలను కోల్పోతారని చెబుతున్నారు నిపుణులు. ఈ వేసవిలో తమ భవిష్యత్‌కు ఓ మార్గం వేసుకుని స్మార్ట్‌గా వ్యవహరించాలని సూచిస్తున్నారు. భవిష్యత్‌లో తాము చేయబోయే ఉద్యోగాలకు ముందస్తు అనుభవం పొందడానికి వేదికగా వినియోగించుకోవచ్చు. ఆన్లైన్ ఉద్యోగ పోర్టల్స్ ఇన్‌డీడ్ వంటి వాటిలో కూడా ఈ తరహా పార్ట్‌టైమ్ ఉద్యోగాలు కనిపిస్తున్నాయి. అయితే మోసం చేసే వారూ ఉంటారని గుర్తించి జాగ్రత్తగా వ్యవహరించాలి. తాము పనిచేయబోయే చోటు, సంస్ధ గురించి పూర్తిగా తెలుసుకుని ఉద్యోగాలలో చేరడం మంచిదని సూచిస్తున్నారు.
ఏదో ఒక ఉద్యోగం కాదు..
సెలవులను సద్వినియోగం చేసుకోవాలని ఏదో ఒక ఉద్యోగం చేసేయం కాదు.. రేపటి కోసం ఈనాడే పునాది వేసుకోవాలి. అందుకు మార్గాలను అన్వేషించాలి. రెండు నెలలు సెలవులను ఆస్వాదిస్తూనే భవితకు బంగారు బాట కూడా వేసుకోవాలి. ఇంటర్న్‌షిప్ చేయడం ఇప్పుడు ఇంజినీరింగ్ సహా పలు స్ట్రీవ్లలో తప్పనిసరి అయింది. కళాశాలలే చాలా వరకూ ఇంటర్న్‌షిప్ చేసే అవకాశాలను అందిస్తున్నాయి. అయితే మెరుగైన ప్రాజెక్టుల కోసం అందుబాటులోని అవకాశాలను కూడా అందిపుచ్చుకోవాలి. అందుకోసమని ఫేక్ కన్సల్టెన్సీలను సంప్రదించి మోసగాళ్ల బారిట పడవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అంతగా చదువులు అవసరం లేని..
పార్ట్ టైం ఉద్యోగాలు చేయటానికి డిగ్రీలు అవసరం లేదు. ప్రతిభ ఉంటే ప్రోత్సహించటానికి తాము సిద్ధం అనే సంస్థలు హైదరాబాద్ వంటి నగరాల్లో చాలానే ఉన్నాయి. అందులో మార్కెటింగ్ రంగానిదే అగ్రస్థానం. ఆ తరువాత రంగాల్లో హాస్పిటాలిటీ, ఈవెంట్ మేనేజ్మెంట్, సేల్స్ తదితర రంగాలున్నాయి. కొంతమంది ఈ-కామర్స్ డెలివరీ బాయ్‌లుగా నమోదు చేసుకుంటున్నారు. లైసెన్స్ అవసరం లేని బ్యాటరీ వాహనాలు అందుబాటులో ఉండటం, పలు సంస్థలు వీటిని అద్దె ప్రాతిపదికన అందిస్తుండటంతో కొంతమంది ఈ దిశగా కూడా చూస్తున్నారు.
ఇలా కూడా ఆలోచించండి..
ఇప్పుడున్న పోటీ వాతావరణంలో కష్టపడడం అవసరమే కానీ, ప్రణాళిక ప్రకారం పనిచేస్తే మంచి ఫలితాలు ఉంటాయని ఓ కన్సల్టెన్సీ సంస్థ ప్రతినిధి కొమ్మినీడి సాయి పేర్కొన్నారు. వేసవి ఉద్యోగాలను ఎంచుకునే ముందు తమకు అనువైన ఉద్యోగం ఏదో నిర్ణయించుకోవాలి. చదువుతున్న చదువుకు సంబంధించిన ఉద్యోగం అయితే అన్ని విధాల శ్రేయస్కరం. అలా కాకపోయినా తమ అభిరుచులకు తగిన ఉద్యోగమైనా ఫర్వాలేదు. ఆన్లైన్లో కూడా ఎన్నో జాబ్ సైట్స్ కనిపిస్తున్నాయి. ఇంటర్న్‌షిప్‌లను అందించేందుకు కూడా పలు వెబ్సైట్లు అందుబాటులో ఉన్నాయి. సామాజిక మాధ్యమాలలో రీల్స్ లేదంటే షార్ట్స్ చూడటంతో పాటు, మీకు ఉపయోగపడేది చూసేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి.
……………………………………………