
* వరంగల్ ఘటనతో కొత్త తరహా అనుమానాలు
* నకిలీ హాల్మార్క్ ముద్రల వ్యవహారం వెలుగులోకి
* పుత్తడి ధరలు దూసుకుపోతున్న వేళ.. నకిలీల కలకలం
ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ : ధరించడం, దర్పం చూపడంలోనే కాదు.. మా అమ్మాయి.. బంగారం, నీ మనసు బంగారం కానూ.. ఇలా తెలుగు వాళ్ల మాటల్లోనూ బంగారం ప్రస్తావన ఎక్కువగా ఉంటుంది. మగువలకే కాదు, చాలా మంది మగవాళ్లకూ పుత్తడంటే ఇష్టమే. అటువంటి పుత్తడి ధరలు హై స్పీడ్ లో దూసుకుపోతున్నాయి. తాజాగా బుధవారం మరోసారి ఆల్టైమ్ గరిష్ఠానికి చేరి, తులం బంగారం ధర రూ.లక్షకు చేరువైంది. అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం ఇతరాత్ర కారణాలు ఎలాఉన్నా బంగారం రేటు సామాన్యుడు కలలో కూడా మోయలేని స్థితికి చేరుకుంటోంది. బుధవారం దేశ రాజధాని ఢిల్లీలో 99.9 ప్యూరిటీ బంగారం ధర ఒకే రూ.1,650 పెరిగి తులానికి రూ.98,100 చేరింది. మరో వైపు 99.5 ప్యూరిటీ గోల్డ్ ధర సైతం రూ.1,650 పెరిగి తులానికి రూ.97,650కి పెరిగి గరిష్ఠానికి చేరుకుంది. పుత్తడి ధరలు అమాంతం ఇలా దూసుకుపోతున్న వేళ.. నకిలీల కలకలం వినియోగదారులను మరింత ఆందోళనకు గురి చేస్తోంది.
తాజాగా ఏం జరిగిందంటే..
మెరిసేదంతా బంగారం కాదనే సామెత ఎప్పటి నుంచో వాడుకలో ఉన్నదే. కొత్తగా హాల్ మార్క్ ముద్ర ఉన్నంత మాత్రాన కూడా బంగారం కాదని తెలంగాణలోని వరంగల్ జిల్లాలో జరిగిన ఘటనతో వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని ఓ బ్యాంకులో కుదువ పెట్టిన బంగారాన్ని ఇటీవల పరిశీలించిన అధికారులు అది నకిలీదిగా గుర్తించారు. ఏకంగానే ప్రభుత్వ బ్యాంకులోనే నకిలీ బంగారం తాకట్టు డబ్బు తీసుకోవడం సంచలనంగా మారింది. నకిలీ హాల్ మార్క్ ముద్రలు వేసి, అసలైన బంగారంగా నమ్మించి బురిడీ కొట్టించినట్లు తెలిసింది. కొద్ది రోజుల క్రితం వెలుగులోకి వచ్చిన నకిలీ హాల్మార్క్ ముద్రల వ్యవహారం పై నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. ప్రస్తుతం వరంగల్ నగరంలో అవసరానికి మించి హాల్మార్క్ సెంటర్లు ఏర్పాటు కావడాన్ని పరిగణనలోకి తీసుకొని లోతుగా దర్యాప్తు సాగిస్తున్నారు. వీటిలో కొత్తగా వెలిసిన సెంటర్లపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించారు. హాల్మార్క్ సెంటర్లు పాటించాల్సిన నిబంధనలు, అవసరానికి మించి సెంటర్లు ఏర్పాటు కావడం, వాటి నిర్వాహకుల తీరు, పరీక్షల నిర్వహణపై కూడా సమాచారాన్ని సేకరిస్తున్నారు. అయితే, బంగారంపై హాల్ మార్క్ నకిలీ ముద్రలు వేస్తున్నారన్న సమాచారం పుత్తడి ప్రియుల్ని ఆందోళనకు గురి చేస్తోంది. నాణ్యతా ప్రమాణాలు సరిగా లేనప్పటికీ 22 క్యారెట్ నాణ్య తా ప్రమాణాలు కలిగి ఉన్నట్లు నకిలీ ముద్రలు వేస్తూ వినియోగదారులను మోసం చేస్తున్నారు. ప్రత్యక్ష పద్ధతిలో బంగారు ఆభరణం నాణ్యతను గుర్తించలేని వ్యాపారులు, వినియోగదారులు నకిలీ ముద్రలను నమ్మి మోసపోతున్నారు.
హాల్ మార్క్ సెంటర్లలోనే మోసాలు?
రాష్ట్రంలోనే కాదు దేశంలోనే బంగారానికి ఎప్పుడూ విలువ ఉంటుంది. కొనుగోలుకు ప్రజలు ఆసక్తి చూపుతూనే ఉంటారు. అవసరమైనప్పుడు క్షణాల్లో సొమ్ము చేసుకునే అవకాశం ఉండడం, విలువ తగ్గనిది కావడంతో పుత్తడి కొనుగోలుకు మక్కువ చూపుతుంటారు. పేద, మధ్య తరగతి ప్రజలు కూడా బంగారాన్ని రిజర్వ్ నిధిగా భావించి కొనుగోలు చేస్తారు. అంతటి నమ్మ కం, భరోసానిచ్చే పసిడి నాణ్యతను పరీక్షించేందుకు ప్రత్యేకంగా హాల్మార్క్ సెంటర్లు వెలిశాయి. ఇక్కడ బంగారం నా ణ్యతా ప్రమాణాలను పరీక్షించి, ముద్రలు వేస్తాయి. అయితే, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) పర్యవేక్షణలో నిర్వహించే కొన్ని హాల్మార్క్ సెంటర్లు పచ్చిమోసాలకు అడ్డాలుగా మారడం కలకలం రేపుతోంది. నకిలీ ముద్రలు వేసి నాణ్యతా ప్రమాణాలు లేని బంగారానికి, అసలు బంగారమే కానీ లోహాలకు 916 కేడీఎం(22 క్యారెట్) బంగారంగా నకిలీ ముద్రలు వేసి వినియోగదారులను దోపిడీ చేస్తున్నాయి.
అసలు హాల్ మార్క్ అంటే ఏంటి?
మొట్టమొదటి సారిగా 2019 నవంబరులో హాల్ మార్క్ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2021 జూన్ 15 నుంచి హాల్ మార్క్ ఉన్ బంగారు అభరణాలను మాత్రమే అమ్మాలనే నిబంధన అమల్లోకి వచ్చింది. కొనుగోలుదారుల ప్రయోజనాలు కాపాడేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. గోల్డ్ హాల్మార్కింగ్ అనేది బంగారం స్వచ్ఛతను ధృవీకరిస్తూ ఇచ్చే లోగో. హాల్మార్కింగ్ ఇవ్వడానికి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) ప్రమాణాలు పెట్టింది. హాల్మార్కింగ్ లేని నగలు అమ్మడానికి వీలులేదు. మార్కింగ్ లేని నగలు అమ్మితే… సదరు వర్తకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. ప్రస్తుతం నగల షాపుల్లో హాల్మార్కింగ్ లేని నగలు కూడా లభ్యమవుతున్నాయి. అయితే, హాల్ మార్క్ నకిలీ ముద్రలతోనూ నగలు అమ్ముతుండడంతో నాణ్యత పరిశీలించడం వినియోగదారులకు సవాలుగా మారుతోంది. అయితే, హాల్ మార్క్ నగలను విక్రయించే దుకాణాల పూర్తి జాబితాను బీఐఎస్ వెబ్ సైట్ లో చూడవచ్చు. బంగారు హాల్ మార్క్ గురించి ఫిర్యాదు చేయాలనుకుంటే నేరుగా బీఐఎస్ను సంప్రదించవచ్చు.
………………………………………………….