నిజాం రాజు మీద బాంబు వేసిన యోధులు వరంగల్ వారే.
నిజాం ప్రభువు మీర్ ఉస్మాన్ అలీఖాన్ ను అంతమొందించడమే వారి లక్ష్యం
ఆకేరు న్యూస్ – ( ప్రత్యేక ప్రతినిధి -హైదరాబాద్ ) : నిజాం రాజు నియంత పాలనకు వ్యతిరేకంగా ప్రజలు అనేక రూపాల్లో తిరుగుబాటు చేసేవారు. భారత కమ్యూనిస్టు పార్టీ అద్వర్యంలో సాయుధ పోరాటం చేసింది. ఆర్యసమాజ్, కాంగ్రెస్ పార్టీ సహా అనేక సంస్థలు తమకు తోచిన పద్దతుల్లో నిజాం రాజుకు వ్యతిరేకంగా పోరాడారు. అదే విదంగా ఆర్య యువక్రాంతి దళ్ అనే ఒక సంస్థ ద్వారా నిజాం రాజును అంతమొందించడమే లక్ష్యంగా పనిచేశారు. కొండా లక్ష్మణ్ బాపూజీ ఈ సంస్థకు సలహాదారుగా ఉన్నారు. సంస్థలో నారాయణ రావు పవార్, పండిత్ విశ్వనాథ్,రెడ్డి పోచనాధం, గూడూరు నారాయణ స్వామి, బాలకిషన్, గండయ్య, జగదీష్ ఆర్య లు సభ్యులుగా ఉన్నారు.
- గోవిందరాజుల గుట్ట నివాసి నారాయణ రావు పవార్
నిజాం రాజు మీద బాంబు వేసిన నారాయణరావు పవార్ , ఈ దళంలో సభ్యులుగా ఉన్న గూడూరి నారాయణ స్వామి లు ఇద్ద్దరు
కూడా వరంగల్ వారే. నారాయణరావు పవార్ తండ్రి పండరీనాథ్ ఇప్పటి కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ జిల్లా కు చెందినవాడు. బీదర్ అపుడు హైదరాబాద్ సంస్థానంలోనే ఉండేది.1900 సంవత్సరంలో వచ్చిన దారుణమైన కరువు ( డొక్కల కరువు ) వల్ల పండరీనాథ్ కుటుంబంతో వరంగల్ వలస వచ్చారు. వరంగల్ రైల్వే స్టేషన్ నిర్మాణ పనిలో కూలీగా పనిచేశారు. రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న గోవిందరాజుల గుట్ట ప్రాంతంలో నివాసం ఉండేవారు. నారాయణ రావు పవార్ 12 వతరగతి వరకు వరంగల్‌లోనే చదువుకున్నాడు
న్యాయవాది కావాలన్న కోరిక ఉన్నప్పటికీ ఆర్థిక పరిస్థతి సహకరించకపోవడంతో కొంతకాలం రేషన్ డిపార్ట్మెంట్ లో ఎన్యూమరేటర్‌గా ఉద్యోగం చేశారు. అనంతరం హైదరాబాద్‌లో లా చదివాడు. అప్పటికే ఆర్యసమాజ్ కార్యకలాపాలతో పరిచయం ఏర్పడింది. నిజాం రాజును చంపేందుకు ఏర్పాటు చేసిన దళంలో క్రియాశీలక నేతగా ఎదిగారు. ఈ దళంలో ఉన్న మరో నాయకుడు గూడూరి నారాయణ స్వామి వరంగల్ నగరంలోని దర్గా కాజీపేటకు చెందినవాడు. అప్పటికే రైల్వే లో ఉద్యోగం చేస్తున్నారు. ఉద్యోగం చేస్తూనే నిజాం వ్యతిరేక పోరాట కార్యకలాపాల్లో పాల్గొనేవాడు. నిజాం రాజు మీద బాంబు వేసిన తర్వాత ఎందుకు వేశారన్న వివరాలను ప్రజలకు తెలియజేసేందుకు రహస్యంగా విజయవాడ వెళ్ళి ప్రెస్ కు విడుదల చేసే పని నారాయణ స్వామికి అప్పగించారు. ఆ పని విజయవంతంగా చేసాడు. - బాంబు పేలింది.. నిజాం రాజు తప్పించుకున్నాడు
నిజాం రాజు ప్రతీ రోజూ తల్లిని చూసేందుకు పాతబస్తీకి తప్పనిసరిగా వెళతాడని తెలుసుకున్నారు. పకడ్భందీ ప్రణాళిక రూపొందించారు. అదీ డిసెంబర్ 4 వ తేదీ 1947 సాయంత్రం నాలుగు గంటలు .. నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఓల్డ్ సిటీకి బయలు దేరారు. అప్పటికే నారాయణ రావు పవార్ దళం సిద్దంగా ఉంది. ముందుగా బాంబు వేసే బాధ్యత నారాయణ రావు పవార్‌కు అప్పగించారు. ఇక్కడ తప్పించుకుని కారు ముందుకు వెళితే జగదీశ్ ఆర్య, వెనక్కి వెళితే గండయ్యలు దాడి చేసే విదంగా వ్యూహం రచించారు. వ్యూహం బెడిసికొట్టింది. పవార్ వేసిన బాంబు గురి తప్పింది. రాజు కారు ముందుకు కాకుండా వెనుకకు కాకుండా పక్కనే ఒక ఇంట్లోకి రాజు కారు డ్రైవర్ చాకచక్యంగా దూసుకెళ్ళారు. దీంతో పవార్‌ను గుర్తించిన పోలీసులు పట్టుకున్నారు. జేబులో ఉన్న రివాల్వర్ తీయకుండా పోలీసులు చేతులు గట్టిగా పట్టుకున్నారు. రివాల్వర్ స్వాధీనం చేసుకున్నారు. స్థానికులు పవార్‌ను విచక్షణారహితంగా చితకబాదారు. పోలీసులు తీసుకెళ్ళి విచారణ పేరుతో చిత్రహింసలకు గురి చేశారు. విచారణ అనంతరం నారాయణ రావు పవార్‌కు ఉరిశిక్ష విధించారు. హైదరాబాద్ విముక్తి తర్వాత ఉరిశిక్ష రద్దు కావడంతో 1949 ఆగస్ట్ 10 న దాదాపు రెండేళ్ళ జైలు జీవితం అనంతరం చంచల్ గూడా జైలు నుంచి నారాయణ రావు పవార్ విడుదలయ్యారు. ఈవివరాలన్నీ ప్రముఖ రచయిత పరవస్తు లోకేశ్వర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నారాయణ రావు పవార్ స్వయంగా చెప్పారు. పరవస్తు లోకేశ్వర్ నిజాం రాజుపై పాలనపై తిరుగుబాటు చేసిన కొద్దిమంది పోరాట యోధుల ను పలకరించి నిజాం పై నిప్పులు కురిపించిన విప్లవ వీరులు అనే పుస్తకాన్ని ప్రచురించారు.