
ఆకేరున్యూస్, హైదరాబాద్: తెలంగాణ పాస్‌పోర్ట్ దరఖాస్తుదారులకు త్వరలోనే ఎలక్ట్రానిక్ చిప్ ఆధారిత పాస్‌పోర్టులతో విమానాల్లో ప్రయాణించవచ్చు. విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) సూచనలతో హైదరాబాద్‌లో ‘ఈ-చిప్ పాస్‌పోర్ట్’ జారీని ప్రారంభించేందుకు తెలంగాణ ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం (ఆర్పీవో) అవసరమైన ఏర్పాట్లు చేస్తుంది. 12 నగరాల్లో చేపట్టనున్న పైలట్ ప్రాజెక్ట్‌లో హైదరాబాద్‌ను కూడా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ సందర్భంగా ఎంచుకుంది. చెన్నై, నాగ్‌పూర్, భువనేశ్వర్, జమ్ము, గోవా, సిమ్లా, రాయ్‌పూర్, అమృత్సర్, జైపూర్, సూరత్, రాంచీలో కూడా ‘ఈ-చిప్ పాస్‌పోర్ట్’ జారీని ప్రారంభించనున్నారు. కాగా, కొత్త ఈ-చిప్ ఆధారిత పాస్‌పోర్ట్ ప్రస్తుత పాస్‌పోర్ట్‌ను పోలి ఉంటుంది. కానీ, అత్యంత అధునాతన భద్రతా వ్యవస్థతో కూడిన చిప్‌ను కలిగి ఉంటుంది. దరఖాస్తుదారుడి పూర్తి వివరాలు ఈ చిప్‌లో నిక్షిత్తమై ఉంటాయి. దీంతో ఎయిర్‌పోర్టుల్లో సులువుగా ప్రయాణికుడి వివరాలు తెలుసుకోవచ్చు. కాగా, సాధారణ పాస్‌పోర్ట్ జారీకి వారం నుంచి పది రోజులు పడుతుంది. అయితే కొత్త ఈ-చిప్ పాస్‌పోర్ట్ కేవలం ఏడు రోజుల్లో జారీ అవుతుంది. ఇప్పటికే ఉన్న పాస్‌పోర్ట్‌లు కూడా కొనసాగుతాయని ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం అధికారులు తెలిపారు. కొత్త ఈ చిప్ పాస్‌పోర్ట్ జారీ తర్వాత ఆటోమేటిక్‌గా పాత పాస్‌పోర్ట్ రద్దవుతుందని తెలిపారు.
……………………………………………………..