
* మహానగరంలో రోజూ వర్షం
* ఎండాకాలంలోనూ బ్యాగుల్లో జర్కిన్లు
* రాత్రి కాగానే వాన
* కొద్ది రోజులుగా హైదరాబాద్‌లో భిన్న వాతావరణం
* ఎండల్లోనూ అధిక వర్షపాతం నమోదు
* మధ్యాహ్నం వరకు భగభగలు మామూలే
* ముందుగానే మేల్కొన్న జీహెచ్ఎంసీ
* అత్యవసర సమావేశం ఏర్పాటు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : మరి కొద్ది రోజుల్లో ఎండాకాలం ముగియబోతోంది. ఆశ్చర్యం ఏంటంటే.. మే నెలలో ఉక్కబోతతో కుతకుతలాడాల్సిన వాతావరణం వానాకాలాన్ని తలపిస్తోంది. ముఖ్యంగా సాయంత్రం అయిందంటే చాలు.. వాన పలకరిస్తోంది. వారం రోజులుగా హైదరాబాద్ మహానగరంలో ఇటువంటి భిన్న వాతావరణమే ఏర్పడింది. మధ్యాహ్నం 40 నుంచి 41 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా, సాయంత్రం ఈదురు గాలులతో వర్షాలు కురుస్తున్నాయి. ఉదయం భానుడి భగ..భగలకు ఉక్కిరిబిక్కిరవుతున్న నగరవాసులు, రాత్రి కురుస్తున్న వర్షాలతో తడిసి ముద్దవుతున్నారు.
అత్యధిక వర్షపాతం
ఏటా మే నెలలో అతి తక్కువ వర్షపాతం నమోదవుతుంది. హైదరాబాద్‌లో సాధారణంగా 54.9 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదుకావాల్సి ఉండగా, ఈ నెల 13వ తేదీ వరకు 122.8 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. రెండువారాల్లో సాధారణం కంటే 124 శాతం అధిక వర్షపాతం నమోదైంది. రంగారెడ్డి జిల్లాలో సాధారణంగా 55.1 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 13 రోజుల్లో 62.7 మిల్లిమీటర్ల వర్షం కురిసి 14 శాతం అధిక వర్షపాతం నమోదైంది. మేడ్చల్-మల్కాజిరి జిల్లాలో మే 13వ తేదీ నాటికి 55.5 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదుకావాల్సి ఉండగా, 74.2 మిల్లిమీటర్ల వర్షం కురిసి 34 శాతం అధిక వర్షపాతం నమోదైంది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మే 13వ తేదీ నాటికి 45.8 మిల్లిమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా 54.7 మిల్లిమీటర్ల వర్షం కురిసింది.
సాయంత్రమైందంటే గాలి.. వాన
నగరంలో దాదాపు ఐదు రోజులుగా సాయంత్రం అయిందంటే చాలు.. ఈదురుగాలులతో పాటు వర్షం కురుస్తోంది. వర్షానికి పలు ప్రాంతాలు తడిసిముద్దయ్యాయి. గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో వీచిన ఈదురుగాలకు చెట్లకొమ్మలు విరిగిపడుతున్నాయి. విద్యుత్ అంతరాయాలు ఏర్పడుతున్నాయి. ఇలాంటి పరిస్థితులు ఎక్కువగా వర్షాకాలంలో ఉంటాయి. కానీ, ఈ ఏడాది ఎండాకాలంలోనే కనిపించడం గమనార్హం.
ఎల్లో హెచ్చరికలు
గ్రేటర్లో కొన్ని రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షం కురిసే అవకాశం ఉంటుందని బేగంపేట వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాలకు మరో నాలుగురోజుల పాటు వాతావరణశాఖ ఎల్లో హెచ్చరికలు జారీచేసింది. నగరంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షం, ఉరుములతో కూడిన జల్లులు, గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంటుందన్నారు. ఉపరితల గాలులు పశ్చిమ/, వాయువ్య దిశగా గంటకు 8-12 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు.
ముందస్తు చర్యలు చేపట్టాలి
ముందస్తు వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. కమిషనర్ కర్ణన్ అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఉన్నతాధికారులు 24 గంటలూ అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో వర్షాకాల ముందస్తు ఏర్పాట్లపై ఇంజనీరింగ్, ట్రాఫిక్ పోలీసులతో నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. వానాకాలంలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని అన్నారు. మొబైల్ రెస్పాన్స్ టీమ్‌ల వాహనాలకు జీహెచ్ఎంసీ లోగోతో సైనేజీ బోర్డు ఏర్పాటు చేయాలని, ఆయా బృందాల ఫోన్ నెంబర్లను స్థానిక స్టేషన్ హౌస్ ఆఫీసర్ల (పోలీస్)కు ఇవ్వాలన్నారు. వరద నీరు నిలిచే ప్రాంతాలను అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ (ఏసీపీ), జోనల్ కమిషనర్లు సంయుక్తంగా పరిశీలించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
…………………………………………………..