
* మాజీ ఎంపి మాలోత్ కవిత
ఆకేరున్యూస్, మహబూబాబాద్: రైతు సంక్షేమంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు సాగిందని.. కానీ కాంగ్రెస్ వచ్చాక దానిని పూర్తిగా విస్మరించారని మాజీ ఎంపీ మాలోత్ కవిత అన్నారు. సకల జనుల అభ్యున్నతే లక్ష్యంగా బిఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు సాగిందన్నారు. రైతుల సంక్షేమం కోసం చేపట్టిన పథకాలు దేశంలో ఎక్కడా లేవన్నారు. రైతులకు అండగా నిలిచేలా పెట్టుబడి పథకం దేశం ఎక్కడైనా అమలు చేస్తున్నారా చెప్పాలన్నారు. కానీ కాంగ్రెస్ సంక్షేమాన్ని తుంగలో తొక్కిందని అన్నారు. కెసిఆర్ పథకాలు ఎందుకు అమలు చేయడం లేదో కాంగ్రెస్ నేతలు చెప్పాలన్నారు. కాంగ్రెస్ నేతలు ప్రజలను మభ్యపెట్టలేరని అన్నారు. ప్రతి వర్గానికి చేదోడువాదోడుగా నిలిచేలా పథకాలు అమలు చేసిన ఘనత మాజీ సిఎం కెసిఆర్దని అన్నారు. నాయకులు తమ స్వలాభం కోసం, స్వార్థం కోసం సిద్ధాంతాలను విస్మరించడం వల్లే బిఆర్ఎస్ ఓడిరదని స్పష్టం చేశారు. తండాలన్నీ కొత్త పంచాయతీలుగా ఏర్పాటు చేసి ఎన్నికలు జరిపిన ఘనత కెసిఆర్దన్నారు. ఇకపోతే ఏటా వర్షాకాలంలో రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం మాయమయ్యిందని అన్నారు. అడవుల విస్తీర్ణం తగ్గడంతో వర్షాలు సమృద్ధిగా కురువడం లేదన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించాలంటే అందరూ మొక్కలు నాటడమే మార్గమని కెసిఆర్ గుర్తించారని అన్నారు. రైతులు వర్షంపై అధారపడి పంటలు పండిస్తారని.. వానలు కురవాలంటే మొక్కలు నాటి సంరక్షించుకోవాలని తెలిపారు.
…………………………………………………..