
* పాక్ కు భారత్ హెచ్చరిక
* న్యాయానికి కొత్త రూపం ఆపరేషన్ సిందూర్..
* ఆక్రోశం కాదు.. సమర్ధ భారత రౌద్ర రూపం.. ఆపరేషన్ సిందూర్..
* ఉగ్రదాడి జరిగితే భారత్ సమాధానం ఇలాగే ఉంటుంది
* భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
ఆకేరు న్యూస్, డెస్క్ : ఆపరేషన్ సిందూర్ ద్వారా ఉగ్రవాదులను తుదముట్టించామని, ఆపరేషన్ సిందూర్ పట్ల దేశ ప్రజలంతా గర్వ పడుతున్నారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) అన్నారు. తమ ప్రభుత్వం త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చిందన్నారు. త్రివిధ దళాలు చక్రవ్యూహాలు పన్ని, పాక్‌ను ఉక్కిరిబిక్కిరి చేశాయని వివరించారు. రాజస్థాన్ బికినీర్ లో జరిగిన కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ.. పహల్గాం ఘటనకు జవాబుగా 22 నిమిషాల్లోనే ఉగ్రవాదులను మట్టుబెట్టామని, ఇక్కడ మోదీ ఉన్నాడన్న సంగతి పాకిస్థాన్ (Pakisthan) మరచిపోయినట్టుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మన మహిళల సిందూరం చెరిపిన వాళ్లను మట్టిలో కలిపేశామన్నారు. రాజస్థాన్(rajasthan) లోని ఎయిర్ బేస్‌ను ధ్వంసం చేయాలని పాక్ ప్రయత్నించిందన్నారు. కానీ, ఎయిర్ బేస్‌ను పాక్ క్షిపణులు తాకలేకపోయాయని తెలిపారు. మన వాయుసేన మాత్రం పాక్ లోని ఎయిర్ బేస్ లను ధ్వంసం చేసిందన్నారు. పాక్ ఎయిర్ బేస్‌లు ఇప్పుడు భారత్ దెబ్బకు ఐసీయూలోకి వెళ్లిపోయాయని తెలిపారు. పాకిస్థాన్ తో చర్చలంటూ ఉంటే.. అది పీఓకే (POK) పైనే అన్నారు. మన రక్తంతో ఆడుకోవాలంటే పాక్ భారీ మూల్యం చెల్లించుకోవాలన్నారు. ఆపరేషన్ సిందూర్.. న్యాయానికి కొత్త రూపం, ఆపరేషన్ సిందూర్.. ఆక్రోశం కాదు.. సమర్ధ భారత రౌద్ర రూపం.. అన్నారు. ఇకపై ఉగ్రదాడి జరిగితే భారత్ సమాధానం ఇలాగే ఉంటుందని దాయాదులను హెచ్చరించారు.
…………………………………………..