* ఈఓ శేషుభారతి అవినీతిపై విచారణ చేపట్టండి
* హనుమకొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో రాష్ట్రీయా హిందూ పరిషత్ ఫిర్యాదు
ఆకేరు న్యూస్, హనుమకొండ : భద్రకాళీ బండ్ కింద గల ఊళ్లో ఆంజనేయులు (బెస్తవాడ ఆంజనేయస్వామి దేవాలయం) ఇనామ్ భూమి సర్వే నంబర్ 817 విస్తీర్ణం ఏ1-20 గుంటల స్థలంపై లోకాయుక్తలో ఫిర్యాదు ఉన్నందున ఆ స్థలంలో చేపట్టనున్న వేద పాఠశాల ప్రారంభోత్సవాన్ని నిలిపివేయాలని, ఈఓ శేషుభారతి అవినీతిపై విచారణ చేపట్టాలని రాష్ట్రీయా హిందూ పరిషత్ హనుమకొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం లో ఫిర్యాదు చేశారు. దేవాలయ పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు చీకటి రాజు ఈమేరకు వినతిపత్రం అందించారు. గతంలో ఆ స్థలం అన్యాక్రాంతం కాకుండా తాము కాపాడి, అప్పటి కలెక్టర్ కరుణకు ఫిర్యాదు చేయగా, వారు తక్షణమే స్పందించి ఆ స్థలంలోని అక్రమ నిర్మాణాలను కూల్చివేయించి, స్థలం చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మించేలా చర్యలు చేప్టటారని పేర్కొన్నారు. అయితే సరైన కొలతలు చేపట్టకపోవడాన్ని అదునుగా చూసుకుని, మాడిశెట్టి సతీష్, మాడిశెట్టి సంపత్ దంపతులు అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, అలాగే అధికార పార్టీ కార్పొరేటర్ వేముల శ్రీనివాస్, అతని భార్య, బిడ్డ, బావమరిది పేరు మీద సర్వే నంబర్ 831తో 1400 గజాల స్థలం ఆక్రమించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కాసర్ల అనిల్, శ్రవణ్‌కుమార్, సంథ్యారాణి, గుర్రాల అనిత, గురిశాల శిరీష, సల్లాల రమేష్‌బాబు, గొరక్ కిరన్, బత్తిని కిషోర్, ఉప్పల బాలరాజు కూడా ఆక్రమణలకు పాల్పడినట్లు ఆరోపించారు. దీనిపై తాము పూర్తి ఆధారాలతో లోకాయుక్తకు ఫిర్యాదు చేయగా, ఈ దేవాలయ ఇన్చార్జి, ఈఓ శేషుభారతి ని వివరణ కోరినా, ఆమె లోకాయుక్త కోర్టుకు హాజరు కాలేదన్నారు. వారి కేసులు పెట్టాలని కోర్టు ఆదేశించినా ఇప్పటివరకు అమలు చేయలేదన్నారు. ఇప్పుడు ఆ భూమికి వేద పాఠశాలకు, ఫంక్షన్ హాలుకు లీజుకు ఇస్తామని, నెలల వ్యవధిలో రిటైర్మెంట్ ఉన్నందున అవినీతికి పాల్పడుతూ, తాను కొందరికి భూమిని కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఆమెపై చాలా ఫిర్యాదులు ఉన్నాయని, వాటిపై విచారణ చేపట్టడంతోపాటు ఆ స్థలం అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు దేవాలయ పరిరక్షణ సమితి ఫిర్యాదు చేసింది.
………………………………………….
