
* ఆందోళన కలిగిస్తున్న కలుషిత ఆహారం
* తరచూ వెలుగులోకి ఘటనలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : హైదరాబాద్ ఫుడ్ కు పెట్టింది పేరు. ఇక్కడ బిర్యానీ ఎంత ఫేమస్సో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ పేరు వింటేనే లొట్టలేసుకుంటారు. కానీ, ఇటీవల వెలుగు చూస్తున్న కొన్ని ఘటనలను చూస్తే వామ్మో.. బిర్యానీయా అనాల్సి వస్తోంది. ఒక్క బిర్యానీ అనే కాదు… రెస్టారెంట్లు, హోటళ్లలో ఆహార నాణ్యత నానాటికీ దిగజారుతోంది. లాభాలే లక్ష్యంగా కొందరు వ్యాపారులు అపరిశుభ్రమైన ఆహారాన్ని కస్టమర్లకు అందిస్తూ వారి ప్రాణాలతో చలగాటం ఆడుతున్నారు. పాచిపోయిన చికెన్, పురుగులు పట్టిన కూరగాయలు, ఏమాత్రం శుభ్రత పాటించని వంటగదిలో అత్యంత దారుణంగా రెస్టారెట్లు, హోటళ్లు భోజనం తయారు చేస్తున్నాయి. అందుకు ఓ ఉదాహరణ.. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని మెహఫిల్ రెస్టారెంట్ లో వెలుగుచూసిన బిర్యానీలో బల్లి ఘటన. బిర్యానీలో బల్లి రావడం ఒక ఎత్తయితే ప్రశ్నించిన కస్టమర్ తో యజమాని చెప్పడం మరో దారుణం. ‘ఆ ఏమైతుంది? బల్లి మంచిగా ఫ్రై అయ్యిందిగా..రుచిగా ఉంటుంది. బాగా తిను’ అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు. ఇలాంటి ఘటనలు హైదరాబాద్ లో కోకొల్లలు.
నియంత్రణ ఏది?
ఇలాంటి ఘటనలు జరుగుతున్నప్పుడు అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు మారడం లేదు. కుళ్లిన మాంసం, కూరగాయల వినియోగం, బిర్యానీ, ఆహార పదార్థాల్లో బొద్దింకలు, ఇతరత్రా పురుగులు రావడం, అపరిశుభ్ర కిచెన్లు, కాలం చెల్లిన సామగ్రి వాడకం సాధారణమై పోయాయి. తాగునీటి నుంచి అల్లం వెల్లుల్లి మిశ్రమం, కారం, పసుపు.. ఇలా అన్నీ కల్తీనే. అయినా వాటిని నియంత్రించే పరిస్థితి లేదు. గ్రేటర్లోని పలు హోటళ్లలో తనిఖీలు నిర్వహించిన కమిషనర్ ఫుడ్ సేఫ్టీ(సీఎఫ్ఎస్) టాస్క్ఫోర్స్ బృందాలు జీహెచ్ఎంసీ ఎఫ్ఎస్ఓల వైఫల్యాన్ని పలుమార్లు ఎత్తి చూపాయి. హోటళ్లు, మార్ట్లతోపాటు పండ్ల రసాలు విక్రయశాలల్లోనూ లోపాలు గుర్తించారు. వీది ఆహార విక్రయశాలల వద్ద తనికీలు నిర్వహించి లెక్కలో చూపుతోన్న జీహెచ్ఎంసీ ఎఫ్ఎస్ఓలు కొందరు.. తమకు అనుకూలంగా ఉండే హోటళ్ల జోలికి వెళ్లడం లేదు.
ప్రాణాలు పోతున్నా పట్టదా
కూకట్పల్లి జోన్ పరిధిలోని ఓ సర్కిల్లో ఒకే హోటల్లో రెండు, మూడు పర్యాయాలు షవర్మ తిని పౌరులు అస్వస్థతకు గురయ్యారు. ఖైరతాబాద్ జోన్ పరిధిలో మోమోస్ తిన్న వారిలో పలువురు అనారోగ్యం పాలు కాగా ఒకరు మరణించారు. ఈ ఘటనపై హడావిడి చేసిన యంత్రాంగం అనంతరం మిన్నకుండిపోయింది. ఇప్పటి వరకు కారకులపై చర్యలు తీసుకోలేదు. బిర్యానీ హోటళ్లు ఎక్కువగా ఉండే సికింద్రాబాద్ జోన్లో తరచూ ఫిర్యాదులు వస్తుంటాయి. అయినా ఒక్క హోటల్ విషయంలోనూ అధికారులు నిబంధనల ప్రకారం వ్యవహరించలేదు. నామ్ కే వాస్తే తనిఖీలు, నోటీసుల జారీ. అప్పుడప్పుడూ నమూనాల సేకరణ, కేసుల నమోదు.. ఇదీ గ్రేటర్లోని కొన్ని సర్కిళ్లలో ఫుడ్ సేఫ్టీ అధికారుల(ఎఫ్ఎస్ఓ) తీరు. ఆహారంతో పౌరులు ప్రాణాలు కోల్పోతున్నా వారికి పట్టడం లేదు.
ఫిర్యాదులు ఎన్నో
సామాజిక మాధ్యమాలు, జీహెచ్ఎంసీ మొబైల్ యాప్, నేరుగా ఫిర్యాదులు అందుతున్నా ఎఫ్ఎస్ఓలు నిబంధనల ప్రకారం నడుచుకోవడం లేదు. ఇప్పటి వరకు ఎఫ్ఎస్ఓల్లోనే కొందరు డిజిగ్నేటెడ్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లుగా ఉండడంతో మంత్రి, రాజు అన్నీ తామే అని ఇష్టానికి వ్యవహరిస్తున్నారు. కొందరు ఎఫ్ఎస్ఓల తీరుపై ఫిర్యాదులూ ఉన్నతాధికారులకు అందాయి. ఈ నేపథ్యంలో కమిషనర్ ఇలంబరిది కీలక నిర్ణయం తీసుకున్నారు. జోనల్ కమిషనర్లకు డిజిగ్నేటెడ్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లుగా ఇటీవల బాధ్యతలు అప్పగించారు. క్రమం తప్పకుండా సమీక్షలు, అప్పుడప్పుడూ క్షేత్రస్థాయి పర్యవేక్షణలు చేపట్టాలని ఆదేశించారు.
………………………………………………