
* నేటినుంచి జూన్ 20 వరకు ప్రతి మండలంలో రెవెన్యూ సదస్సుల నిర్వహణ
* ఆగస్టు 15 నాటికి భూ సమస్యలను పరిష్కరించి రైతులకు భూ భద్రత కల్పిస్తాం.
* మనిషికి ఆధార్ ఉన్నట్లు ప్రతి భూమికి భూధార్ వ్యవస్థ ఏర్పాటు
* నాట్ల కంటే ముందే రైతుల ఖాతాలో రైతు భరోసా నిధులు జమ
* ఖమ్మం జిల్లాలోభూ భారతి సర్వే, రెవెన్యూ సదస్సులను ప్రారంభించిన డిప్యూటీ సీఎం, మంత్రులు పొంగులేటి, తుమ్మల
ఆకేరున్యూస్, ఖమ్మం: దేశానికే తలమానికంగా భూ భారతి రెవెన్యూ చట్టాన్ని ప్రజా ప్రభుత్వం రూపొందించిందని, పేద ప్రజలకు చుట్టంగా భూ భారతి చట్టం పనిచేస్తుందని డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం ములుగుమాడులో భూ భారతి సర్వే, రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సుల కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క,మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, సీసీఎల్ఏ నవీన్ మిట్టల్, సర్వే సెటిల్మెంట్ ల్యాండ్ రికార్డ్స్ కమీషనర్ డాక్టర్ జ్యోతి బుద్ధ ప్రకాష్, ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ లతో కలిసి ప్రారంభించారు. అనంతరం డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ నక్షాలు లేకుండా మన రాష్ట్రంలో 413 గ్రామాలలో దశాబ్దాల కాలంగా పాలన సాగుతోందని, ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరుగుతూ కష్టాలు పడుతున్నారని, భూ భారతి చట్టం ద్వారా 413 గ్రామాల ప్రజలకు శాశ్వత పరిష్కారం కల్పించేందుకు సర్వే చేయించి సరిహద్దులను నిర్ణయించి ఇబ్బందులు లేకుండా చేయాలని పైలెట్ ప్రాజెక్టు క్రింద ములుగుమాడు గ్రామాన్ని ఎంపిక చేసామని తెలిపారు.భూ భారతి చట్టం ప్రకారం ప్రతి సంవత్సరం గ్రామాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహించి, భూమి అమ్మకాల, కొనుగోలు వివరాలను అప్ డేట్ చేస్తూ, భూ రికార్డులను మాన్యువల్ గా రాసి పంచాయతీ కార్యాలయంలో అతికించడం జరుగుతుందని అన్నారు. భూ సంస్కరణల కారణంగా రాష్ట్రంలో దాదాపు 26 లక్షల ఎకరాలు పేదలకు అసైన్డ్ చేస్తూ పంపిణీ చేయడం జరిగిందని, ధరణి లో ఇట్టి భూములను పార్ట్ బీలో పెట్టి ప్రజలకు ఇబ్బందులకు గురి చేశారని, అర్హులైన వారికి భూ భారతి చట్టం ద్వారా పట్టాలు పంపిణీ చేస్తామని అన్నారు. భవిష్యత్తులో అసెంబ్లీ సెగ్మెంట్ వారిగా అసైన్మెంట్ కమిటీ ఏర్పాటు చేసి మిగులు భూములను ఇంటి పట్టాల పంపిణీ, భూ పంపిణీ కార్యక్రమాన్ని తిరిగి ప్రవేశ పెడ్తున్నట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. ప్రజలకు ఉన్న భూ సమస్యలను పరిష్కరించేందుకు సివిల్ కోర్టుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా రెవెన్యూ అధికారుల దగ్గరే పరిష్కరించుకునేలా అప్పీల్ వ్యవస్థ ఏర్పాటు చేశామని అన్నారు.
రైతులు చాలా ఆందోళనకు గురవుతున్నారు..
అనంతరం మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ.. పట్టాపాస్ పుస్తకాలలో ఉన్న తప్పుల కారణంగా రైతులు చాలా ఆందోళనకు గురవుతున్నారని, గ్రామంలో ఉన్న తక్కువ విస్తీర్ణం భూమికి కూడా కొన్ని చోట్ల పట్టాలలో వేల ఎకరాలు ఉన్నట్లు ఉందని, దీనివల్ల ప్రభుత్వంపై కూడా భారం పడుతుందని మంత్రి తెలిపారు. భూముల ధరలు పెరిగిపోవడం వల్ల అన్నదమ్ములు, స్నేహితుల మధ్య కూడా గొడవలు జరిగి హత్యల వరకు దారి తీస్తున్నాయని, వీటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం భూ భారతి చట్టం తీసుకువచ్చిందన్నారు. పైలెట్ ప్రాజెక్టు నుంచి వచ్చిన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని, మన శక్తి మేరకు వేగవంతంగా సర్వే చేసి నిఖార్సైన రికార్డులు తయారు చేస్తామని అన్నారు.దేశంలో శాంతి భద్రతలు మన తెలంగాణ రాష్ట్రంలోనే అద్భుతంగా ఉన్నాయని, ప్రజా ప్రభుత్వం భారీ ఎత్తున పెట్టుబడులను సాధించిందని, ప్రపంచ దేశాలతో తెలంగాణ పోటీ పడుతుందని మంత్రి అన్నారు. నాట్లకు ముందే రైతు భరోసా పథకం నిధులు ప్రభుత్వం జమ చేస్తుందని అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం మొదటి విడత క్రింద ప్రభుత్వం 4 లక్షల 50 వేల ఇండ్లను మంజూరు చేసిందని, వీటిని గుడిసెలలో ఉండే పేదలను ఎంపిక చేసి అమలు చేయాలని మంత్రి అధికారులకు సూచించారు.
ప్రజల అభిలాష మేరకే ప్రభుత్వ పాలన..
మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ.. ప్రజల అభిలాష మేరకు ప్రభుత్వం పాలన అందించాలనే లక్ష్యంతో, గత పాలకులు ప్రజలపై రుద్దిన ధరణి చట్టం వల్ల రైతులు, ఆసాములు పడిన ఇబ్బందులు తొలగించాలని సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం 18 రాష్ట్రాల్లోని రెవెన్యూ చట్టాలను స్టడీ చేసి భూ భారతి చట్టం ఏప్రిల్ 14 న ప్రవేశ పెట్టిందని అన్నారు.భూ భారతి చట్టం అమలు ప్రజలపై ఎటువంటి ప్రభావం ఉంటుందో గమనించాలని ముందస్తుగా నాలుగు మండలాలను, రెండో విడతలో ప్రతి జిల్లాలో ఒక మండలం పైలెట్ క్రింద ఎంపిక చేసుకొని రెవెన్యూ సదస్సులు నిర్వహించామని, ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 3 నుంచి జూన్ 20 వరకు అన్ని రెవెన్యూ గ్రామాలలో తహసిల్దార్ అధ్యక్షతన రెవెన్యూ బృందం రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తుందని మంత్రి తెలిపారు.ప్రజల నుంచి ఒక రూపాయి కూడా ఫీజు తీసుకోకుండా వారికి ఉన్న భూ సమస్యలు పరిష్కరిస్తామని, పేదలకు చుట్టంగా భూ భారతి చట్టం పని చేస్తుందని అన్నారు. రాబోయే ఆగస్టు 15 నాటికి ప్రజల భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించి ప్రజలకు భద్రత కల్పిస్తామని అన్నారు.
…………………………………………………..