
* వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారద
ఆకేరున్యూస్, వరంగల్: భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టం అమలులో భాగంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని
జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద సూచించారు. వరంగల్ మండలంలోని ఏనుమాముల, ఖిలా వరంగల్ మండలం అల్లిపూర్ గ్రామాలలో నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సులలో కలెక్టర్ పాల్గొన్నారు. రైతులతో ముఖాముఖి మాట్లాడి, వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. భూ భారతి చట్టంలోని అంశాలను వివరిస్తూ, రైతుల సందేహాలను నివృత్తి చేశారు. భూ సమస్యలు పరిష్కరించి, రైతులకు వారి భూములపై పూర్తి హక్కులు కల్పించేందుకే ప్రభుత్వం భూభారతి చట్టం అమలు చేస్తోందని కలెక్టర్ స్పష్టం చేశారు. ఇప్పటికే వర్ధన్నపేట మండలంలో పైలెట్ ప్రాతిపదికన రెవెన్యూ సదస్సులు జరిపి, క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేశామని అన్నారు. ప్రస్తుతం జిల్లాలోని 12 మండలాలోని రెవెన్యూ గ్రామాలలో ఈ నెల 20వ తేదీ వరకు సదస్సులు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించామని తెలిపారు. తహసీల్దార్, నాయబ్ తహసీల్దార్ల నేతృత్వంలో రెండు బృందాలను నెలకొల్పి, ప్రతి రోజు ప్రతి మండలంలో రెండు గ్రామాలలో రెవెన్యూ సదస్సులు జరిపేలా చర్యలు తీసుకున్నామని కలెక్టర్ తెలిపారు.భూ రికార్డులలో పేరు తప్పులు, విస్తీర్ణం హెచ్చు తగ్గులు, వారసత్వ భూములు, భూ స్వభావం తప్పులు, నిషేధిత జాబితాలో ఉన్న భూ సమస్యలు, సర్వే నెంబర్ మిస్సింగ్, పట్టా పాస్ బుక్స్ లేకపోవడం, ప్రభుత్వ భూములను నవీకరించడం, సాదాబైనామా కేసులు, హద్దుల నిర్ధారణ, పార్ట్-బిలో చేర్చిన భూముల సమస్యలు, భూసేకరణ కేసులు తదితర భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులు సదస్సులలో స్వీకరించి భూభారతి కొత్త చట్టం ప్రకారం అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి, నిర్దేశిత గడువు లోపు సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. నిర్ణీత షెడ్యూల్ ను అనుసరిస్తూ ఆయా గ్రామాలలో అధికారులు ఉదయం నుండి సాయంత్రం వరకు అందుబాటులో ఉండి అర్జీలు స్వీకరిస్తారని తెలిపారు. రెవెన్యూ సదస్సుల్లో ప్రభుత్వపరంగా నిర్ణీత ప్రొఫార్మాలో ప్రింట్ చేసిన దరఖాస్తులను అందజేయడం జరుగుతుందన్నారు. దరఖాస్తుల స్వీకరణ పూర్తయిన అనంతరం క్షేత్రస్థాయి పరిశీలన, విచారణ కోసం వచ్చే రెవెన్యూ బృందాలకు సహకరించాలని కలెక్టర్ సూచించారు.ఈ సందర్భంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ, హెల్ప్ డెస్క్, జనరల్ డెస్క్ ల వద్ద సదుపాయాలు, సిబ్బంది పనితీరును కలెక్టర్ పరిశీలన జరిపి, సమర్ధ నిర్వహణకు
అధికారులకు పలు సూచనలు చేశారు. అర్జీలు సమర్పించేందుకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. భూ సంబంధిత సమస్యలు ఉన్న వారు నిర్ణీత ప్రొఫార్మా లో సరైన విధంగా దరఖాస్తు చేసుకునేలా సహకారం అందించాలని హెల్ప్ డెస్క్ సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమాల్లో తహశీల్దార్లు ఇక్బాల్, నాగేశ్వరరావు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
……………………………………….