
* వేములవాడ కోడెల మృతి దారుణం
* ఎర్రగడ్డ ఆస్పత్రిలో ఫుడ్ పాయిజనింగ్
* మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు
ఆకేరున్యూస్, సిద్దిపేట: కాంగ్రెస్ పార్టీకి పాలన చేతగావడం లేదని ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రంగా విమర్శించారు. వేములవాడలో కోడెల మృతి, ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రిలో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనలపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి పరిపాలన చేయడం చేతకావడం లేదని వ్యాఖ్యానించారు. ఎర్రగడ్డ మానసిక రోగులకు తగిన ఆహారం కూడా అందడం లేదని 70 మంది ఆస్వస్థతకు గురయ్యారని, ఈ విషయంపై ఇప్పటివరకు సీఎం నుంచి ఎలాంటి స్పందన కనిపించలేదని మండిపడ్డారు. వేములవాడలో కోడెల మరణం కొనసాగుతుండగా ప్రభుత్వం స్తంభించినట్లే ఉంది అని వ్యాఖ్యలు చేశారు. అనేక కోడెలు గడ్డి లేక చనిపోతున్నా, ప్రభుత్వం పట్టింపు తీసుకోవడంలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మాకు బాధ్యత అప్పగిస్తే కోడెలను కాపాడుతాం అని స్పష్టత ఇచ్చారు. ఈ మధ్యే మాపై కేసులు పెట్టడం, కమిషన్లు ఏర్పాటు చేయడం తప్ప అసలు సమస్యలపై ప్రభుత్వాన్ని పట్టించుకోడం లేదని, నిజమైన ప్రజా సమస్యలను వదిలి మిగతా విషయాల్లో బిజీ అయ్యారని తెలిపారు. ఇక రేపటి కేబినెట్ సమావేశంలో రైతు బంధు డబ్బులను వెంటనే విడుదల చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని తీవ్రంగా పిలుపునిచ్చారు.
…………………………………………..