
* జనంలోకి వస్తోన్న తమిళ వెట్రి కళగం అధ్యక్షుడు సినీ హీరో విజయ్
* 42 రోజుల పాదయాత్రకు ప్లాన్
ఆకేరు న్యూస్ డెస్క్: మొదటి నుండీ తమిళనాడు రాజకీయాలు సినీ ప్రముఖుల చుట్టూ తిరుగుతున్నాయి. దశాబ్దాల కాలంగా తమిళ రాజకీయాలను సినిమా వారే శాసిస్తున్నారు. కరుణానిధి ,ఎంజీరాంచంద్రన్ నుంచి మొదలుకొని నేడు విజయ్ వరకు తమిళనాడు రాజకీయాల్లో సినిమా వారి పాత్రే ఎక్కువ ఉంటుంది. ఆ రోజుల్లో అగ్ర హీరోగా ఓ వెలుగు వెలిగిన ఎంజీ రాంచంద్రన్ తమిళ రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగారు. ముఖ్యమంత్రిగా తనదైన ముద్ర వేశారు. అలాగే ప్రముఖ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన జయలలిత ఎంజీ ఆర్ తరువాత అన్నాడీఎంకే తరపున సీఎం అయ్యారు. సినీ రచయితా రాణించిన కరుణా నిధి తమిళనాడుకు సీఎం అయ్యారు. ఇప్పుడు కరుణానిధి కుమారుడు స్టాలిన్ సీఎంగా ఉండగా స్టాలిన్ కుమారుడు సినీ హీరో ఉదయనిధి స్టాలిన్ కూడా అసెంబ్లీలో అడుగుపెట్టారు. రాధికా, శరత్ కుమార్,కుష్బూ లాంటి వారు రాజకీయాల్లో చురుకుగా వ్యవహరిస్తున్నారు. తమిళనాడులో అత్యంత క్రేజ్ కలిగిన సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా అప్పట్లో రాజకీయ పార్టీ పెడతారనే అనుకున్నారు కాని ఎందువల్లనో రజినీ కాంత్ ఆ ఆలోచనను మానుకున్నట్లు ఉన్నారు. మరో అగ్ర హీరో కమల్ హసన్ మక్కల్ నీది మయ్యం పేరుతో రాజకీయాల్లో క్రియాశీలకంగా పని చేస్తున్నారు.
విజయ్ స్టైలే వేరు..
తనదైన స్టైల్ తో అభిమానుల్లో క్రేజీ పెంచుకున్న హీరో విజయ్ ఇప్పడు అగ్ర హీరోగా ఓ వెలుగు వెలుగుతున్నాడు.. విజయ్ సినిమాలు అన్నీ బ్రహ్మాండంగా ఆడుతున్నాయి. అభిమానుల్లో విజయ్ అంటే విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ నేపధ్యంలో విజయ్ తమిళగ వెట్రి కళగం పేరుతో
ప్రాంతీయ పార్టీని స్థాపించిన విషయం తెల్సిందే.
2026 వైపు అడుగులు
వచ్చే సంవత్సరం తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్న నేపధ్యంలో హీరో విజయ్ జనంలోకి వెళ్లడానికి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.. పాదయాత్ర ద్వారా జనంలోకి వెళ్లాలని విజయ్ భావిస్తన్నారు. జూన్ రెండో వారంలో ఈ పాదయాత్ర చేపట్టనున్నట్లు తెలుస్తోంది. పాదయాత్ర విషయమై పార్టీ క్యాడర్ తో చర్చిస్తున్నట్లు సమాచారం.. మొత్తానికి రానున్న అసెంబ్లీ ఎన్నికలు తమిళనాడులో ఆసక్తికరంగా మారనున్నాయి. తారల మధ్య పోరులో ఈ తార వెలుగుతాడో ఏ తార కనుమరుగవుతాడో చూడాలి మరి.
……………………………………………………………