
– గొల్లుమన్న మహిళా స్టూడెంట్
– సైబర్ నేరగాడి వలలో చిక్కి ఆవేదన
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : టెలిగ్రామ్‌లో వచ్చిన సందేశాన్ని నమ్మిన హైదరాబాద్(HYDERABAD)కు చెందిన 24 ఏళ్ల విద్యార్థిని.. అరగంటలో 1.27 లక్షలు పోగొట్టుకుంది. టెలీగ్రామ్ నుంచి ఒక సందేశం వచ్చింది. అరగంటలో రూ.5వేలు రావడంతో మురిసిపోయిన ఆమె రూ.1.27 లక్షలు పెట్టుబడి పెట్టి మోసపోయింది. నగరానికి చెందిన 24 ఏళ్ల విద్యార్థినిని గుర్తుతెలియని వ్యక్తి జీపీ డిస్కషన్ 063 గ్రూపులో యాడ్ చేశారు. గోద్రేజ్ ప్రాపర్టీస్(GODREJ PROPERTIES)లో పెట్టుబడులు పెడితే అరగంటలోనే అధిక లాభాలు వస్తాయని నమ్మించారు. దీన్ని ఒక పార్ట్‌టైమ్ ఉద్యోగంగా చేసుకోవచ్చు రోజుకు తక్కువలో తక్కువ రూ.5వేలు సంపాదించుకోవచ్చు అంటూ బురిడీ కొట్టించారు. ఇదేదో బాగుందని నమ్మిన బాధితురాలు రూ. 10వేలు పెట్టుబడి పెట్టింది. అరగంటలోనే రూ. 5 వేలు లాభం వచ్చినట్లు చూపించి రూ. 15వేలు ఆమె ఖాతాలో జమ చేశారు. ఆ తర్వాత రూ. 31,572లు పెట్టుబడి పెడితే అరగంటలో రూ. 70వేలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. అనుకున్నట్లుగానే జమ చేశారు. ఆ తర్వాత రూ. 65వేలు చెల్లిస్తే, రూ. 2.12వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. దాంతో వారి మాటలు పూర్తిగా నమ్మిన బాధితురాలు విడతల వారీగా రూ. 1,27,354లు చెల్లించింది. పెట్టిన పెట్టుబడికి రూ. 7,38,959లు లాభాలు వచ్చాయని వర్చువల్‌గా చూపించారు. విత్‌డ్రా ఆప్షన్ లేకుండా క్లోజ్ చేశారు. ఇదేంటని ప్రశ్నిస్తే మీ డబ్బులు సేవ్ చేశామని మరింత ఎక్కువ పెట్టుబడి పెట్టండి అని నమ్మబలికారు. ఇదంతా సైబర్ మోసమని ఆలస్యంగా గుర్తించిన బాధితురాలు సిటీ సైబర్ క్రైమ్ (CITY CYBER CRIME) పోలీసులకు ఫిర్యాదు చేసింది.
……………………………………………………