
* శిథిలం తొలగిస్తున్న ప్రతీ క్షణం.. భయం.. భయం
* ఎవరి శవాన్ని చూడాల్సి వస్తుందోనని గుండె దడ
* సిగాచి పేలుడు ఘటనలో బాధిత కుటుంబాలకు తీరని వ్యథ
* ఇంకా ఆచూకీ తెలియని వారి పరిస్థితి మరింత దుర్భరం
* మరోవైపు మార్చురీలో గుర్తుపట్టలేనంతగా మృతదేహాలు
* తెలంగాణ చరిత్రలో తీవ్ర విషాదం
ఆకేరు న్యూస్, గ్రౌండ్ రిపోర్ట్ : ఎటుచూసినా ఆర్తనాదాలే.. వారి కళ్లన్నీ అక్కడి శిథిలాల వైపే. సహాయక చర్యల్లో ఉన్న సిబ్బంది ఒక్కో శిథిలం తొలగిస్తున్న కొద్దీ.. భయం.. భయం. ఎంత ఘోరం చూడాల్సి వస్తుందో.., ఎవరి శవం బయటపడుతుందో.. శిథిలాలు తీస్తున్నప్పుడల్లా వారి గుండె దడదడ కొట్టుకుంటోంది. తమ చేతిని ఆ గుండెపై అదిమిపెట్టుకుని గుండెలవిసేలా రోదిస్తున్నారు. రెండు రోజులుగా అక్కడే పడిగాపులు కాస్తున్నారు. హైదరాబాద్ సిగాచి కెమికల్ పరిశ్రమలో సంభవించిన పేలుడు ఘటనలో చనిపోయిన వారి బంధువుల విషాదం ఒకలా ఉంటే, ఇంకా ఆచూకీ తెలియని వారి కుటుంబీకుల పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. దేవుడా.. మాకెందుకు ఇంతటి శిక్ష? విధించావయ్యా.. అంటూ వారు కన్నీరుమున్నీరు అవుతుంటే చూసేవారి కళ్లు సైతం చెమ్మగిల్లుతున్నాయి.
ఆ తల్లీ బిడ్డలకు ఎవరు ఆసరా?
సిగాచి కెమికల్ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో చనిపోయిన వారిలో ఒడిశా, యూపీ, బిహార్ కు చెందిన కార్మికులే ఎక్కువగా ఉన్నారు. పొట్టకూటి కోసం రాష్ట్రం కాని రాష్ట్రం వచ్చి.. కష్టపడి ఉన్నంతలో బతుకుదామని వలసొచ్చిన ఆ కార్మిక కుటుంబాలకు ఇప్పుడు తీరని వ్యథ మిగిలింది. ఇప్పటి వరకు 42 మంది చనిపో్యినట్లు నిర్ధారణ కాగా, మరికొందరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇంకా కొంత మంది ఆచూకీ తెలియడం లేదు. శిథిలాలు తొలగిస్తున్న కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి. ఇంటి పెద్ద కోల్పోయిన ఆ తల్లీ బిడ్డలకు ఎవరు ఆసరా? కట్టలు తెంచుకుంటున్న కన్నీళ్లకు ఆనకట్టపడేదెప్పుడు? అన్న ప్రశ్నలే ఇప్పుడు మెదిలో మెలుతున్నాయి. ఆచూకీ తెలియని వారి కుటుంబాల సభ్యులు ఎవరి మృతదేహం కనిపిస్తుందోనన్న భయంతో అక్కడే పడిగాపులు కాస్తున్నారు. ఇంకా ఎక్కడో బతికే ఉంటాడన్న ఆశ.. ఆవిరి అయిపోతుందేమనని ఆందోళన చెందుతూ, తమ వా ళ్లు ఏమాయ్యరో తెలియక రోదిస్తున్నారు.
మార్చురీ వద్ద హృదయ విదారక పరిస్థితులు
తెలంగాణ చరిత్రలోనే ఇంతటి ఘోర ప్రమాదం జరగలేదని స్వయానా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఫార్మా చరిత్రలోనే ఇది పెను విషాదం. దీంతో పఠాన్‌చెరులోని పరిశ్రమ, ఆస్పత్రి వద్ద హృదయ విదారక పరిస్థితులు కనిపిస్తున్నాయి. పఠాన్ చెరు ప్రభుత్వం ఆస్పత్రి మార్చురీలో 35 మృతదేహాలు ఉన్నాయి. తీవ్రంగా కాలిపోయిన వారు ఎవరో తెలియడం లేదు. ఇప్పటి వరకు 10 మందిని మాత్రమే బంధువులు గుర్తించగలిగారు. గుర్తుపట్టలేనంతా శరీరాలు కాలిపోయాయి. దీంతో మిగిలిన 25 మంది గుర్తించేందుకు డీఎన్ ఏ పరీక్షలు తప్పనిసరి అయ్యాయి. ఆ పరీక్షల ఫలితాలు వచ్చిన తర్వాతే మృతదేహాలను కుటుంబ సభ్యలకు అప్పగిస్తారు. రిపోర్టు రావడానికి రెండు రోజు సమయం పడుతుందని అధికారులు చెబుతుండడంతో మార్చురీ వద్దే మృతుల కుటుంబీకులు కన్నీరు మున్నీరవుతూ కూర్చున్నారు. వారి రోదనలో అక్కడ విషాద వాతావరం ఏర్పడింది.
………………………………………………………..