
– జనగామ కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్
ఆకేరు న్యూస్, జనగామ: విద్యార్థులు తమ భవిష్యత్తుకు పునాదులు పడాలంటే బట్టి పట్టే చదువులకు స్వస్తి చెప్పాలని జనగామ జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ భాషా సూచించారు. ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలను ప్రతిరోజు చదువుకోవడం వల్ల కంఠస్థం అవుతాయని సబ్జెక్టులపై పూర్తి విషయపరిజ్ఞానం పెరుగుతుందని అన్నారు. పోటీ పరీక్షలకు భవిష్యత్తు పునాదులకు చదవడమే చక్కటి పరిష్కారమని రుతువు పలికారు. బట్టి పట్టే చదువులకు భవిష్యత్తు ఉండదని చదువుకున్న వారికే చక్కటి భవిష్యత్తు ఉంటుందని అన్నారు. విద్యార్థులు పాఠశాల స్థాయిలోనే తమ ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ అన్నారు. బుధవారం ఇప్పగూడెం జడ్పీ సెకండరీ పాఠశాలను సందర్శించి 9,10 వ తరగతి విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడారు. యూనిఫామ్స్, నోట్ బుక్స్ అందరికీ వచ్చాయా, భోజనం బాగుంటుందా, చదువు ఎలా ఉంది అని విద్యార్థులతో ముచ్చటించారు. సబ్జెక్టులన్నీ అర్థమవుతున్నాయా, ఎవరెవరికి ఏ సబ్జెక్టు లు కష్టంగా ఉన్నాయి. కెరియర్ లో ఎవరెవరు ఏమేం కావాలి అనుకుంటున్నారో ఒక్కొక్క విద్యార్థిని అడిగి తెలుసుకున్నారు. కష్టంగా ఉన్న సబ్జెక్టుల మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాలని, ఎక్కువ రీడింగ్ ప్రాక్టీస్ ఉండాలని విద్యార్థులకు, ఎప్పటికప్పుడు స్లిప్ టెస్ట్ లు పెట్టాలని ఉపాధ్యాయులకు కలెక్టర్ సూచించారు. వంటగదిని పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు శుభ్రంగా పెట్టాలని దోమలు, ఈగలు రాకుండా శానిటేషన్ పక్కగా ఉండాలని, బియ్యం, కూరగాయలను బాగా కడగాలని, వంట తీరు పరిశుభ్రంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రఘుజి, ఇతర ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.
…………………………………………………………