
– ఇది వరకు హైడ్రా పేరిట దుర్మార్గం
– మాజీ స్పీకర్ సంచలన వ్యాఖ్యలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఇది వరకు హైడ్రా పేరిట జరిగిన దుర్మార్గాన్ని చూశామని, ఇప్పుడు కాలనీలు, బస్తీలను కూల్చి వేసేందుకు రేవంత్ రెడ్డి స్కెచ్ వేస్తున్నారని మాజీ స్పీకర్ మధుసూధనా చారి (MAHDUSUDANA CHARI) సంచలన వ్యాఖ్యలు చేశారు. గౌలిదొడ్డి గ్రామ పరిధిలోని బసవతారక నగర్ బస్తీవాసుల గుడిసెలను కొందరు దౌర్జన్యంగా కూల్చి వేశారన్న సమాచారం మేరకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆదేశాలతో శుక్రవారం ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్‌తో కలిసి బస్తీవాసులను మధుసూధనచారి పరామర్శించారు. బస్తీవాసులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా తమకు సొంత నిధులతో బోరు వేయించి మంచినీటి సదుపాయం కల్పించారన్నారు. చీకట్లో అనేక ఇబ్బందులు పడుతుంటే విద్యుత్ సదుపాయం కల్పించారన్నారు. 2021లో అధికారులు గుడిసెలను తొలగిస్తే అప్పట్లో కార్పొరేటర్‌గా ఉన్న కొమిరిశెట్టి సాయిబాబా అర్హులైన కొందరికి ఇళ్లను మంజూరు చేయించారన్నారు. అప్పట్లో ప్రతి పక్ష నాయకుడిగా ఉన్న రేవంత్ రెడ్డి (REVANTHREDDY) బసవతారక నగర్ వాసులకు ఇక్కడే ఇళ్లు కట్టిస్తామని చెప్పారని, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక రౌడీలు వచ్చి తమ ఇళ్లు ఖాళీ చేసి వెళ్లి పోవాలని బెదిరిస్తున్నారన్నారని ఆరోపించారు. అనంతరం మధుసూదన చారి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో పేదలకు అనేక హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చాక పేదల బస్తీలు, కాలనీలను కూల్చే కార్యక్రమం చేస్తుందన్నారు. బీఆర్ఎస్ పార్టీ, పేదలకు అండగా ఉంటుందన్నారు. బస్తీలను కూల్చి వేసేందుకు స్కెచ్ వేసి, బినామీ పేర్లతో ప్రభుత్వ పెద్దలే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారన్నారు. ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్ మాట్లాడుతూ రెక్కాడితే గాని డొక్కాడని పేదల బస్తీ బసవతారక నగర్లో ఎక్కడ చూసినా కూల్చిన చర్చ్, గుడితో సహా పేదల గుడిసెలు సర్వం కోల్పోయి అన్నమో రామచంద్రా అంటు ఉన్న పేదలను చూస్తే కన్నీళ్లు వస్తున్నాయన్నారు. నగరం నడిబొడ్డున రౌడీలు, కొంత మంది హిజ్రాలతో బెదిరించటం ఎంత వరకు న్యాయమని ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. ఇదేనా ప్రజా పాలన అన్నారు.
……………………………………………….