
– ఇష్టారీతిన నిర్వాహకులు
– ఒక్క లైసెన్స్.. నాలుగేసి దుకాణాలు
– ఎనిమిదికి చేరిన కల్తీకల్లు మృతుల సంఖ్య
– ఇప్పటికైనా కళ్లు తెరిచేనా?
ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ :
కల్తీకల్లు కాటుకు బలై చనిపోయిన వారి సంఖ్య తొమ్మిదికి చేరింది. తీవ్ర విషాదం నింపిన ఈఘటనపై రాష్ట్రంలో తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. ఆయా కల్లు దుకాణాల్లోని శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపిన అధికారులు వాటిలో ఆల్ర్పోజాలం వాడినట్లు నిర్ధారించారు. కల్లు దందా సాగిస్తున్న నిర్వాహకులు ఆదాయం కోసం ఎంతకైనా తెగిస్తారని దీన్నిబట్టి అర్థం అవుతోంది. అంతేకాదు.. ఒక్క లైసెన్స్‌తో ఒక్కొక్కరు నాలుగేసి కల్లు దుకాణాలు నడుపుతున్నట్లు అధికారుల తనిఖీల్లో వెల్లడవుతోంది. మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలో ఈ తరహా దందా ఎక్కువగా సాగుతోంది.
కల్లులోనూ బెల్టు దుకాణాలు
వాస్తవానికి ఎక్సైజ్ శాఖ నుంచి లైసెన్స్‌లు పొందిన వారే కల్లు దుకాణాలను నిర్వహించాల్సి ఉంటుంది. తాడి కోఆపరేటీవ్ సొసైటీ(టీసీఎస్)లో సభ్యులుగా ఉన్న వారికే అవకాశం ఉంటుంది. అయితే ఒక్క లైసెన్స్‌తో ఆ దుకాణంలో సమీప ప్రాంతాల్లో మరో నాలుగు దుకాణాలు ఏర్పాటు చేస్తున్నారు. అనుబంధ దుకాణాలుగా నడిపిస్తున్నారు. కల్లు కాంపౌండ్లపై ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించేది లేదు.. వారిపై చర్యలు తీసుకునేది లేకపోవడంతో విచ్చలవిడిగా కల్తీ కల్లు విక్రయాలు జరుగుతున్నాయి. ఇటు అనారోగ్యంతో పాటు అటు కాపురాల్లో చిచ్చుపెడుతున్నా ఏదైనా సంఘటనలు జరిగినప్పుడు హడావుడిగా తనిఖీలు, నామమాత్ర కేసులతో అధికారులు చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి.
యథేచ్ఛగా దందా
ప్రధానంగా హైదరాబాద్ శివారు జిల్లాల్లో కల్తీ కల్లు తయారీ, వ్యాపారం యథేచ్ఛగా సాగుతోంది. ఎక్సైజ్ అధికారులు ఏవో సంఘటనలు జరిగినప్పుడు మాత్రమే హడావుడి చేస్తూ ఆ తర్వాత షరా మామూలే అన్నట్లుగా వ్యవహరిస్తుండటంతో వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. యువత ఎక్కువగా కల్తీ కల్లు మత్తుకు బానిసలౌతున్నారు. కల్లు దుకాణాల ముందు పెద్ద పెద్ద కార్లు ఆగివుంటున్నాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. దీనికితోడు ఒక్క లైసెన్స్‌తో తమకు అనుకూలంగా ఉన్న నాలుగు చోట్ల దుకాణాలు ఏర్పాటు చేస్తూ కిరాణ దుకాణాల వలే అందుబాటులోకి తీసుకువస్తున్నారు.
యువతే బానిసలుగా..
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలో ఉపాధి కోసం పెద ్ద ఎత్తున ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుండి పనుల కోసం వలస వస్తుంటారు. వివిధ పనుల్లో స్థిరపడుతున్న వారు కల్తీ కల్లుకు బానిసలౌతున్నారు. ఎక్కడ నాలుగు కంపెనీలున్నా, ఎక్కడ నిర్మాణ పనులు జరుగుతున్నా, ఎక్కడ వలస వచ్చిన వారు నివాసం ఉంటున్నా అక్కడ తెల్లారేసరికి కొత్తగా కల్లు దుకాణం ఏర్పాటు చేస్తున్నారు. ఓ వైపు ప్రభుత్వం స్వచ్ఛమైన ఈత కల్లు, నీరా వంటి వాటిని ప్రోత్సహిస్తున్నా కల్తీ కల్లులో వచే ్చ మత్తు స్వచ్ఛమైన కల్లులో లేకపోవడంతో కల్తీ కల్లుకే మొగ్గు చూపుతున్నారు. ఒక్కసారి కల్తీ కల్లుకు అలవాటు పడితే అంతే సంగతులు. యువత ఎంత కాస్ట్లీ బ్రాండ్ మద్యం తాగినా చివరకు కల్తీ కల్లు తాగకుండా ఉండలేకపోతున్నారు.
………………………………………………………….