
*కల్లూరు,మొగుళ్లపల్లిలో.
* 60 మందిపైగా విద్యార్థినులకు అస్వస్థత
ఆకేరు న్యూస్, డెస్క్ : రాష్ట్ర వ్యాప్తంగా హాస్టళ్లలో ఫుడ్‌పాయిజన్ అవుతున్న సంఘటనలు ఇటీవలి కాలంలో ఎక్కువగా జరుగుతున్నాయి . అయినా ప్రభుత్వం చీమకుట్టినట్లు కూడా వ్యవహరించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆశ్రమ పాఠశాలల్లో ,బీసీ హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ కు గురై ఎంతో మంది విద్యార్థులు ఆస్పత్రుల పాలవుతున్నారు. దీనిపై ప్రతిపక్షాలు ముఖ్యంగా బీఆర్ ఎస్ పార్టీ ఫుడ్ పాయిజన్ ఘటనలపై ప్రభుత్వాన్ని నిలదీస్తోంది. అయినా ప్రభుత్వం స్పందించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. తాజాగా ఖమ్మం జిల్లా కల్లూరు ఎన్ఎస్పి ఆవరణలో ఉన్న గిరిజన ఆశ్రమం బాలికల పాఠశాలలో, (Kallur Ashram School) ,మొగుళ్ళపల్లి మండలం కోర్కిశాలలోని కస్తూర్బా గాంధీ ఆశ్రమపాఠశాలలో విద్యార్థినులు ఫుడ్ పాయిజన్‌కు గురయ్యారు.కల్లూరు ఎన్ఎస్పి ఆవరణలో ఉన్న గిరిజన ఆశ్రమం బాలికలు ఉదయం అల్పాహార కిచిడి తిన్న అనంతరం కడుపు నొప్పి వాంతులు విరోచనాలకి గురై తీవ్ర ఆందోళన గురయ్యారు. ఈ గిరిజన బాలికల ఆశ్రమ వసతి గృహంలో మూడవ తరగతి నుంచి పదవ తరగతి వరకు 91 మంది విద్యార్థినులు చేరి విద్య అభ్యసిస్తున్నారు. సోమవారం ఉదయం అల్పాహారం పేరుతో కిచిడి హాస్టల్ వార్డెన్ పిల్లలకు పెట్టడంతో తిన్న కొద్దిసేపటికి తీవ్రమైన కడుపునొప్పి, వాంతులు, విరోచనాలు రావడంతో గమనించిన హాస్టల్ సిబ్బంది కల్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స చేపట్టారు.
ఆందోళనలో తల్లిదండ్రలు
Kallur Ashram School: హాస్టల్లో ఉన్న 91 మందిలో దాదాపు ఈ కిచిడి 50 మందికి పైగా తినడంతో 30 మందికి పైగా తీవ్రఅస్వస్థతకు గురై హాస్పటల్లో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న విద్యార్థినుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనలకు గురయ్యారు. కల్లూరు గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో అల్పాహారం తిని ఫుడ్ పాయిజన్ కావడంతో తీవ్ర అస్వస్థత గురై హాస్పిటల్లో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానందం (MLA Dr. Matta Ragamayi Dayanandam) హుటాహుటిన కల్లూరు ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి విద్యార్థినులకు అందిస్తున్న చికిత్స గురించి ఆరా తీశారు. ప్రతిరోజు విద్యార్థులకు పెట్టాల్సిన మెనూ కూడా సక్రమంగా పెట్టట్లేదని విద్యార్థులు ఫిర్యాదు చేయడంతో ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాగమయి దయానంద వార్డెన్‌పై తీవ్ర ఆగ్రహంవ్యక్తం చేశారు.
వార్డెన్ పై చర్యలు తీసుకుంటాం
హాస్టల్ వార్డెన్ పై విద్యార్థినులు ఫిర్యాదు చేయడంతో ఎమ్మెల్యే వార్డెన్ పై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు. సమాచారం తెలుసుకున్న జాయింట్ కలెక్టర్ అజయ్య యాదవ్ హాస్పిటల్ కు వచ్చి విద్యార్థినులను పరామర్శించి మెరుగైన వైద్యం అందిం చాలని సూచించారు.
మొగుళ్ళపల్లి కస్తూర్బా గాంధీ విద్యార్థినులు..
మొగుళ్ళపల్లి మండలం కోర్కిశాలలోని కస్తూర్బా గాంధీ ఆశ్రమపాఠశాలలో (Kasturba Gandhi Ashram School) ఫుడ్ పాయిజన్ జరిగి 32 మంది విద్యార్థినీలు వాంతులు విరోచనాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. 18 మంది విద్యార్థినిలను మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆసుపత్రికి తరలించగా, మిగతా 14 మంది విద్యార్థినిలను చిట్యాల మండల కేంద్రంలోని సివిల్ ఆసుపత్రికి (Civil Hospital) తరలించి, చికిత్స అందిస్తున్నారు. సోమవారం ఉదయం విద్యార్థినిలకు కిచిడి తోపాటు టమాట పచ్చడి అల్పాహారంగా ఇచ్చారు. అల్పాహారంలో వచ్చిన పురుగుల మూలంగా విద్యార్థినిలు వాంతులు విరోచనాలతో అస్వస్థతకు గురయ్యారు. పరిస్థితిని గమనించిన పాఠశాల ఉపాధ్యాయినీలు విద్యార్థినీలను ఆస్పత్రికి తరలించారు. విద్యార్థినీలు అస్వస్థతకు గురైన విషయాన్ని వారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. తల్లిదండ్రులు లబోదిబోమంటూ ఆస్పత్రులకు తరలివచ్చారు.
…………………………………….