
* మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
ఆకేరు న్యూస్ హైదరాబాద్ : ఇటీవలి కాలంలో కొంత మంది జర్నలిస్టులు ఇష్టం వచ్చినట్లుగా భాషను ఉపయోగిస్తున్నారని ఇది సరైనపద్దతి కాదని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సూచించారు. మంగళవారం సీనియర్ సంపాదకులు ఇనగంటి వెంకట్రావు రాసిన విలీనం-విభజన మన ముఖ్యమంత్రులు పుస్తకావిష్కరణ కార్యక్రమంలో వెంకయ్యనాయుడు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విలీనం – విభజన మన ముఖ్యమంత్రులు పుస్తకాన్ని నేటితరం యువత తప్పనిసరిగా చదవాలని సూచించారు. ఈ పుస్తకం చదివితే నాయకుల పరిపాలన, విజ్ఞానం, వారి గురించి అన్ని విషయాలు తెలుస్తాయని చెప్పుకొచ్చారు. పత్రికా సమాజానికి దర్పణం లాంటిదని… ఈ సమాజంలో ఏం జరుగుతుందో ప్రజలకు చెప్పాలని ఆకాంక్షించారు. మనం వ్యూస్ కోసం న్యూస్ చేయకూడదని.. దానికోసమే కాలమ్స్ ఉన్నాయని, రాసుకోవడానికి అందులో వాళ్ల అభిప్రాయాలు చెప్పొచ్చని పేర్కొన్నారు. భాష విషయంలో రాజకీయ నాయకులు చాలా హుందాగా ప్రవర్తించాలని సూచించారు. చాలా మంది జర్నలిస్టులు కొత్తగా యూట్యూబ్‌లో ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని.. పాత్రికేయంలో భాష చాలా ముఖ్యమని ఉద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్‌రెడ్డి, పుస్తక రచయిత ఇనగంటి వెంకట్రావు, సీనియర్ జర్నలిస్టులు కట్టా శేఖర్ రెడ్డి, బండారు శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
……………………………………….