
* కష్టపడే రైతన్నే అదృష్టవంతుడు
* వ్యవసాయ సాగుకు జిల్లా అనుకూలం
* మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
* ఫామాయిల్ పంటతో కష్టం తక్కువ లాభం ఎక్కువ
* వ్యవసాయాన్ని పండుగగా మారుస్తున్న ప్రజా ప్రభుత్వం
* మంత్రి సీతక్క
ఆకేరు న్యూస్, ములుగు: ఫామ్ ఆయిల్ పంటను సాగు చేస్తున్న రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడానికి రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో ఫామాయిల్ ఫ్యాక్టరీలను ఏర్పాటు చేయడం జరుగుతుందని, అరుకాలం కష్టపడి పలు పంటలను సాగు చేస్తున్న రైతులే అదృష్టవంతులని రాష్ట్ర వ్యవసాయం, మార్కెటింగ్ , సహకారం, చేనేతలు, వస్త్రాలు శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు.
సోమవారం ములుగు మండలంలోని ఇంచర్ల గ్రామపంచాయతీ శివారులో 12 ఎకరాల స్థలంలో కేఎన్ బయోసైన్స్ కంపెనీ వారు ఏర్పాటు చేస్తున్న ఫామాయిల్ ఫ్యాక్టరీ శంకుస్థాపన కార్యక్రమాన్ని రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణ నీటి సరఫరా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఆయిల్ ఫేడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, రాష్ట్ర ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ శాఖ సంచాలకులు, షేక్ యాస్మిన్ భాషా, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. తో కలిసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఇంచర్ల గ్రామంలోని ఎం ఆర్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ములుగు జిల్లా ఇప్పటికే పర్యాటక ప్రాంతంగా ఎంతగానో అభివృద్ధి చెందిందని, సాగునీరు పుష్కలంగా ఉండడంతో వ్యవసాయానికి అనుకూలంగా మారిందని అన్నారు. సమ్మక్క సారలమ్మ, కాకతీయ రాజులు తిరిగిన ఈ ప్రాంతానికి గొప్ప చరిత్ర ఉందని, ములుగు జిల్లా అభివృద్ధి కావడానికి మంత్రి సీతక్క ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. మంత్రి సీతక్క అభివృద్ధి కార్యక్రమాల కోసం ఏది అడిగినా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా ముందుకు పోతున్నారని తెలిపారు. రైతులు తమకు ఉన్న భూములలో కొంత భాగాన్ని ఫామాయిల్ మొక్కల పెంపకం కేటాయించాలని, మొక్క నాటిన అనంతరం మూడు సంవత్సరాల తరవాత రైతుల ఇండ్లలో సిరులు కురిపిస్తుందని అన్నారు. జిల్లాలో కనీసం పదివేల ఎకరాలలో ఫామాయిల్ మొక్కలు పెంచడానికి జిల్లా యంత్రాంగం రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించాలని సూచించారు. ఇటీవల వెలుగులోకి వచ్చిన కర్రే గుట్టల ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం ప్రత్యేక చోరువ చూపుతున్నదని వివరించారు. ఫామ్ ఆయిల్ గింజలను పండిస్తున్న రైతులకు ప్రస్తుతం టన్నుకు 18 వేల 52 రూపాయలు ఉండగా రైతులకు గిట్టుబాటు కలిగే విధంగా 25 వేలు పెంచడానికి చర్యలు తీసుకుంటున్నామని హామీ ఇచ్చారు. నూతనంగా ఏర్పాటు చేస్తున్న ఫ్యాక్టరీ పనులను రానున్న ఉగాది లోపు పూర్తి చేసి ప్రారంభిస్తామని అన్నారు. ములుగు జిల్లా వ్యవసాయ పంటల సాగుకు అనుకూలంగా భూములు ఉన్నాయని, రైతు పలు రకాల పంటలను సాగు చేసి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని అన్నారు.
మంత్రి సీతక్క మాట్లాడుతూ..
ఫామ్ ఆయిల్ పంట సాగుకు రైతన్నకు కష్టం తక్కువగా ఉండి ఎక్కువ లాభం చేకూరుతుందని, ప్రతి రైతు ఈ పంట సాగు కోసం ప్రయత్నించాలని సూచించారు. జిల్లాలోని రైతులు గతంలో వరి, పత్తి పంట సాగు చేయడానికే ఆసక్తి కనపరిచారని, ప్రస్తుతం ఫామాయిల్ పంట సాగు చేయడానికి ముందుకు రావడం ఆశించదగ్గ విషయమని అన్నారు.
ఈ పంట ద్వారా పచ్చదనంతో పరిసర ప్రాంతాలు ఉండడంతో పాటు ప్రతి సంవత్సరం లక్ష రూపాయల ఆదాయం పొందే అవకాశం రైతులకు దక్కుతుందని, 200 రూపాయలకు లభించే మొక్కను రాష్ట్ర ప్రభుత్వం 25 రూపాయలకే రైతులకు అందిస్తున్నదని ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రైతులు ఎంత ఎక్కువ పంట సాగు చేస్తే, అంత త్వరగా ఆర్థికంగా స్థిరపడగలరు. ఒకసారి పంట పూర్తయ్యాక, కంపెనీలు ఆ పంటను నేరుగా రైతుల నుంచే కొనుగోలు చేస్తారని అన్నారు. ప్రస్తుతం వివిధ పంటలకు అధికంగా పురుగుల మందులు వాడుతున్న నేపథ్యంలో, రైతులు జాగ్రత్తలు పాటించాలన్నారు. జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశ కల్పించడంతో పాటు వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడానికి ప్రజా ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు. మహిళలు సైతం ఆర్థికంగా ఎదగడానికి రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ లేని రుణాలను అందిస్తున్నదని, ప్రభుత్వ హాస్టళ్లకు విజయ డైరీ ద్వారా పాలు పంపిణీ చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. రానున్న కొద్ది రోజుల్లోనే జిల్లా కేంద్రంలో ఐటీ కంపెనీ ఏర్పాటు చేయడానికి శాశ్వత భవనాలను నిర్మిస్తామని తెలిపారు.
భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ ఫామాయిల్ పంట సాగుతూ ఎలాంటి ఇబ్బందులు ఉండవని పంట సాగు కోసం రైతులు ముందుకు రావాలని పిలుపు నిచ్చారు.
ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్లు మహేందర్ జి, సంపత్ రావు, ములుగు మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, గ్రంథాలయ చైర్మన్ బానోతు రవి చందర్, హార్టికల్చర్ అధికారి సంజీవరావు, కే ఎన్ బయోసైన్స్ కంపెనీ ఎండి. సుధా రెడ్డి, జిల్లా, మండల అధికారులు, ప్రజా ప్రతినిధులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.
………………………………………………..