
– ఎంఎస్ చదువుతున్న విద్యార్థిని దుర్మరణం
అకేరు న్యూస్, హైదరాబాద్ : ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన అమ్మాయి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడంతో తల్లిదండ్రులు తీవ్ర దుఃఖసాగరంలో మునిగిపోయారు. దేశం కాని దేశంలో దుర్మరణం చెందిన కుమార్తెను తలుచుకుని కుమిలికుమిలి ఏడుస్తున్నారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. సిద్దిపేట జిల్లా రామరుక్కుల గ్రామానికి చెందిన లక్కర్స్ శ్రీనివాస్, హేమలత దంపతులు హైదరాబాద్‌లోని కుత్బుల్లాపూర్‌లో నివశిస్తున్నారు. వారి పెద్ద కుమార్తె శ్రీజ వర్మ (23)దుండిగల్‌లోని ఏరోనాటికల్ కళాశాలలో ఇంజినీరింగ్ పూర్తి చేసి మూడు సంవత్సరాల క్రితం ఎంఎస్ చదవడానికి అమెరికాలోని చికాగోకు వెళ్లారు. ఈస్ట్రన్ ఇల్లినాయిస్ యూనివర్సిటీలో రెండు సంవత్సరాలు చదువు పూర్తి చేసుకున్నారు. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నారు. అమెరికా కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 9 గంటలకు వారుంటున్న ప్రాంతంలో ఆమె తన స్నేహితురాలితో కలిసి రెస్టారెంట్‌కు భోజనం కోసం వెళ్తుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన ట్రక్ ఢీ కొట్టింది. దీంతో తీవ్ర గాయాలకు గురైన శ్రీజ అక్కడికక్కడే మృతి చెందింది. రోజూ మాదిరిగానే భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 9 గంటలకు తండ్రి శ్రీనివాస్ వర్మ తన కుమార్తెకు ఫోన్ చేయగా లిఫ్ట్ చేయడం లేదు. దీంతో ఆమెతో పాటు ఉంటున్న స్నేహితులకు ఫోన్ చేయగా జరిగిన విషయాన్ని తెలియజేయడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. తమ కుమార్తె మృతదేహాన్ని ఇక్కడికి తెప్పించాలని తల్లిదండ్రులు తెలంగాణ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.
…………………………………………….