
* రిటైర్డ్ తహశీల్దార్ ఇంట్లో దొంగల కలకలం
* 30 తులాల బంగారం, నగదు చోరీ
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో మంగళవారం దొంగలు రెచ్చిపోయారు. వేర్వేరు ప్రాంతాల్లో చోరీకి పాల్పడ్డారు. శేరిలింగంపల్లి సర్కిల్ చందానగర్‌లోని ఖజానా జువెలర్స్‌లో భారీ దోపిడీకి ప్లాన్ చేశారు. ఇదే రోజు అంతకు ముందే కేపీహెచ్‌బీ కాలనీలోని ఓ రిటైర్డ్ ఇంట్లో భారీ చోరీకి పాల్పడ్డారు. ఇంట్లోకి చొరబడి ఇంట్లో నివాసం ఉంటున్న వృద్ద దంపతులపై దాడిచేసి సొత్తును అపహరించారు. కూకట్పల్లి ఏసీపీ రవికిరణ్‌రెడ్డి కథనం ప్రకారం.. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం బలపాల గ్రామానికి చెందిన కొల్లా నాగేశ్వరరావుు (89), సరస్వతి (82) దంపతులు కేపీహెచ్‌బీ కాలనీ ఫేజ్-7 ఎంఐజీ 14లోని ఇంటిలో నివాసం ఉంటున్నారు. నాగేశ్వరరావు ఏపీలో తహశీల్దార్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు. సోమవారం రాత్రి 2గంటలకు నాగేశ్వరరావు, సరస్వతి దంపతులు నిద్రపోతుండగా ముగ్గురు దొంగలు రాడ్లతో తాళం పగులగొట్టి ఇంట్లోకి చొరబడ్డారు. నాగేశ్వరరావు వారిని ప్రతి ఘటించడంతో ఆయనను కొట్టి భార్య మెడలోని బంగారు గొలుసు లాక్కున్నారు. బీరువా పగులగొట్టి దాచి ఉంచిన బంగారు ఆభరణాలు మొత్తం 30తులాలు, రూ.3లక్షల నగదు ఎత్తుకెళ్లారు. అనంతరం వీరి ఇంటి పక్కనే నివాసం ఉంటున్న శ్యాంప్రసాద్‌రెడ్డి ఇంట్లోకి సైతం వెళ్లిదోపిడి చేసేందుకు యత్నించారు. ఆ సమయంలో ఆ ఇంట్లో వారి కుమార్తె గట్టిగా అరుస్తూ వారిని అడ్డుకోవడంతో దోపిడీ దొంగలు అక్కడి నుంచి పారిపోయారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
………………………………………