
– వాణిజ్య సముదాయాలే కాదు.. ఇళ్లూ టార్గెట్
– రాడ్లు, కత్తులు, తుపాకులతో భయబ్రాంతులు
– తాజాగా రెండు.. గతంలోనూ ఎన్నో ఘటనలు
ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ
– హైదరాబాద్ కూకట్‌పల్లిలో ఉంటున్న ఓ రిటైర్డ్ తహశీల్దార్ తన భార్యతో కలిసి నిద్రపోతున్నారు. అర్ధరాత్రి ఇనుపరాడ్లతో దోపిడీ దొంగలు తలుపులు బద్దలగొట్టారు. ఆ వృద్ధ దంపతులైన కొల్లా నాగేశ్వరరావు(89), సరస్వతి (82)లను భయబ్రాంతులకు గురి చేశారు. ఇంట్లోకి ముగ్గురు దొంగలు చొరబడి సరస్వతి మెడలోని బంగారు గొలుసు లాక్కున్నారు. బీరువా పగులగొట్టి 30 తులాల బంగారు ఆభరణాలు, రూ.3లక్షల నగదు ఎత్తుకెళ్లారు. పక్కనే ఉన్న మరో ఇంట్లోనూ దోపిడీ చేసేందుకు యత్నించారు.
– జాతీయ రహదారి పక్కనే ఉన్న ప్రముఖ బంగారు దుకాణంలోకి పట్టపగలు దోపిడీ దొంగలు చొరబడ్డారు. సిబ్బందిపై కాల్పులు జరిపి నగదుతో పాటు ఆభణాలను దోచుకోవడానికి ప్రయత్నించారు. కాల్పులకు తెగబడ్డారు. పోలీసుస్టేషన్‌కు కూతవేటు దూరంలో, నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో తుపాకులతో దూసుకొచ్చిన దుండగుల దోపిడీ వ్యవహారం తీవ్ర కలకలం రేపింది.
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో నిన్న జరిగిన ఈ ఘటనలు సాధారణ దొంగతనాలు కావు. ఇంటి తలుపులు బద్దలు కొట్టి దోపిడీ.. బంగారం దుకాణంలోకి తుపాకులతో దూసుకెళ్లడం తీవ్రంగా పరిగణించాల్సిన అంశాలు. అయితే ఇవే కాదు.. ఇలాంటి దోపిడీలకు హైదరాబాద్‌కు వేదిక అవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇతర రాష్ట్రాలకు చెందిన దోపిడీ ముఠాలు నగరంపై కన్నేస్తుండడం కలకలం రేపుతోంది.
తుపాకులతో కలకలం
పక్కాగా రెక్కీ నిర్వహించి ముఠాలు దోపిడీకి స్కెచ్ వేస్తున్నాయి. ఈ ముఠాల సభ్యులు తప్పించుకు పారిపోయేందుకు, అడ్డుకున్న వారిని బెదిరించేందుకు, కంట్రీమేడ్ తపంచాలతో దాడులకు సైతం తెగబడుతున్నారు. సీసీ కెమెరాలు, సాంకేతికత ఆధారంగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు కొన్ని కేసుల్లో దోపిడీ గ్యాంగు ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. బీదర్‌లో ఏటీఎం సెంటర్ నుంచి నగదు దోపిడీ చేసిన ఇద్దరు దొంగలు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఓ సెక్యూరిటీ గార్డు మృతి చెందిన ఘటన కలకలం రేపింది. ఈకేసులో ఇప్పటి వరకు దొంగలు దొరకనే లేదు.
కొల్లగొడుతున్నారు..
అలాగే కొంపల్లిలోని ఓ దుకాణంలో చొరబడిన దుండగులు డమ్మీ తుపాకీ చూపించి రూ.5 లక్షలు, మొబైల్ ఫోన్ దోచుకెళ్లారు. దుకాణాలకు మెటీరియల్ సరఫరా చేస్తున్న రాజస్థాన్ గ్యాంగు సభ్యులు ఈ దోపిడీకి పాల్పడ్డారు. నిందితులను అరెస్ట్ చేశారు. రాజస్థాన్ ముఠాకు చెందిన ఇద్దరు కస్టమర్ల మాదిరిగా మైలార్‌దేవ్‌పల్లిలోని ఓ జ్యువెలరీ దుకాణంలోకి వెళ్లిన దుకాణ నిర్వాహకుడికి తుపాకి చూపి బెదిరించారు. నేరేడ్మెట్ కేశవనగర్‌లో ధనలక్ష్మి జువెలర్స్‌లో దొంగలు పడ్డారు. దుకాణం వెనుక తలుపులు తెరిచి లాకర్‌ను బద్దలు కొట్టి 25 తులాల బంగారు నగలు, 75 కిలోల వెండి నగలు చోరీ చేశారు. ఇలా దోపిడీ దొంగలు నగరంలో బీభత్సం సృష్టిస్తున్నారు. ఏఎస్రావు నగర్ ప్రధాన రహదారిపై ఉన్న శ్రీ వినాయక జ్యువెలరీ దుకాణంలో చోరీ యత్నం జరిగింది. సెల్‌ఫోన్ అలారం మోగడంతో దుకాణం వద్దకు వచ్చిన యజమానిని చూసి గోడకు కన్నం వేసి లోపలికి వచ్చిన దుండగులు పారిపోయారు.
…………………………………………………………..