
* స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి
* జాతీయ జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్ : నియోజకవర్గ అభివృద్ధే తన ఎజెండా అని స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని స్టేషన్ ఘనపూర్ ( STATION GHANPUR) నియోజకవర్గ కేంద్రంలోని కాంగ్రెల్ పార్టీ కార్యాలయంలో స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి(KADIYAM SRIHARI) గారు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం నూతనంగా ఏర్పడిన స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీ కార్యాలయం ఆవరణలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు హాజరయ్యారు. జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం మున్సిపాలిటీ పారిశుధ్య కార్మికులకు రెయిన్ కోట్,మహిళలకు తడి, పొడి బుట్టలను పంపిణి చేశారు. ఈ సందర్బంగా మున్సిపల్ కార్యాలయం ఆవరణలో మొక్కను నాటారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు మాట్లాడుతూ భారతదేశ వ్యాప్తంగా ఎంతో గొప్పగా పండగ వాతావరణంలో ప్రజలందరూ నిర్వహించుకుంటున్న స్వాతంత్ర దినోత్సవం సందర్బంగా దేశ ప్రజలందరికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భారత దేశం గొప్ప దేశమని దేశానికి స్వాతంత్రం వచ్చి 78ఏళ్ళు పూర్తి చేసుకొని 79ఏటా అడుగుపెట్టామని తెలిపారు. గడిచిన 78ఏళ్లలో ప్రపంచంలో భారత దేశం ఒక బలమైన ఆర్థిక శక్తిగా ఎదిగిందని, ఎంతో అభివృద్ధి సాధించిందని అన్నారు. శాస్త్ర, సాంకేతిక రంగాలలో గణనీయమైన అభివృద్ధి సాధించిందని పేర్కొన్నారు. వివిధ రకాల సంస్కృతి, సంప్రదాయాలు, బాషలతో ఇతర దేశాలకు ఆదర్శంగా నిలుస్తుందని వెల్లడించారు.
రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైఉంది….
భారతదేశం ఇప్పటికి భిన్నత్వంలో ఏకత్వంగా ఉండగలుగుతుంది అంటే దానికి కారణం రాజ్యాంగం మాత్రమేనని తెలిపారు. కానీ గడిచిన కొన్ని సంవత్సరాలుగా పాలకులు రాజ్యాంగానికి తూట్లు పొడిచే ప్రయత్నం చేస్తున్నారని, రాజ్యాంగ మూలసూత్రాలను దెబ్బతిసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అలాంటి వారి నుండి రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని, రాజ్యాంగాన్ని మనం కాపాడుకుంటేనే రాజ్యాంగం మనల్ని కాపాడుతుందని స్పష్టం చేశారు. ఇటీవల లోక్ సభలో రాహుల్ గాంధీ ఓట్ చోరీ అంశాన్ని లేవనేత్తారని అన్నారు. బీహార్ రాష్ట్రంలో ఓటర్ల సవరణ పేరుతో 65లక్షల మంది ఓటర్లను తొలగించారని ఎందుకు తొలగించారని సుప్రీం కోర్ట్ అడిగితే ఎలక్షన్ కమిషన్ దగ్గర సమాధానం లేదని అన్నారు. దీన్ని బట్టి చుస్తే రాజ్యాంగానికి ఎలాంటి ముప్పు ఉందో ప్రజలు గమనించాలని కోరారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రజలందరూ తొడ్పాటు అందించాలని అన్నారు. ఎన్నికల కమిషన్ నిష్పక్ష పాతంగా ఎన్నికలు నిర్వహించాలని సూచించారు.
నియోజకవర్గ అభివృద్ధే నా ఎజెండా..
నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చెందిన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. నాకున్న ఏకైక జెండా, ఎజెండా నియోజకవర్గ అభివృద్ధి మాత్రమేనని తెలిపారు. కొంత మంది పని గట్టుకొని చేసే విమర్శలను పట్టించుకోనని అన్నారు. నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( REVANTH REDDY) గారి సహకారంతో 900కోట్ల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. కాలువలు మరమ్మత్తులు చేయడం ద్వారా ఘనపూర్ నుండి నవాబ్ పేట వరకు అలాగే అశ్వరావుపల్లి నుండి జీడికల్ చెరువు వరకు సాగు నీరు తీసుకురాగలిగామని అన్నారు. దేవాదుల ప్రాజెక్ట్ ద్వారా నియోజకవర్గంలోని ప్రతీ ఎకరానికి రెండు పంటలకు సాగు నీరు అందించే బాధ్యత నాదని హామీ ఇచ్చారు. గతంలో రిజర్వాయార్లను, కాలువలను ఎవరు పట్టించుకోలేదని విమర్శించారు.మరోపక్క రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందని అన్నారు. 25లక్షల మంది రైతులకు 21వేల కోట్ల రుణ మాఫీ చేయడం, 9రోజుల్లోనే 9వేల కోట్ల రైతు భరోసా నిధులు అందించడం, సన్న బియ్యం పంపిణి, రేషన్ కార్డుల పంపిణి, ఇందిరమ్మ ఇల్లు ఒక్కో పథకం ఒక్కో చరిత్ర గా నిలుస్తున్నాయని కొనియాడారు. నియోజకవర్గ ప్రజలందరూ రాజకీయాలు పక్కన పెట్టి నియోజకవర్గ అభివృద్ధికి కలిసికట్టుగా పని చేద్దామని పిలుపునిచ్చారు. కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీని అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకుందామని అన్నారు. ఇప్పటికే మున్సిపాలిటీ అభివృద్ధి కొరకు 55కోట్ల విలువైన పనులకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించామని అతి త్వరలోనే మంజూరు వస్తుందని అన్నారు. రాష్ట్రంలో స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ప్రథమ స్థానంలో నిలపడమే తన లక్ష్యమని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, నాయకులు, మున్సిపాలిటీ అధికారులు, సిబ్బంది, కార్యకర్తలు, మహిళలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
………………………………….