
* ఖజానా జ్యువెలర్స్ దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : హైదరాబాద్‌లోని చందానగర్‌లోని ఖజానా జ్యువెలర్స్ షాపులో
జరిగిన దోపిడీ కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. మాదాపూర్ డీసీపీ కార్యాలయంలో
మీడియా ఎదుట నిందితులను హాజరుపరిచి మాట్లాడారు. ఆయన తెలిపిన కథనం ప్రకారం..
ఆగస్టు 12న ఆరుగురు గుర్తు తెలియని వ్యక్తులు ఆయుధాలతో ముసుగు ధరించి చందనగర్లోని
ఖజానా జ్యువెలర్స్‌లోకి ప్రవేశించారు. డిప్యూటీ మేనేజర్ సతీష్ కుమార్‌పై కాల్పులు జరపడంతో
అతడి ఎడమ మోకాలికి గాయమైంది. దుండగులు సుమారు 10 కిలోల వెండి వస్తువులు, బంగారు పూత పూసిన వెండితో అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనపై చందనగర్ పోలీస్ స్టేషన్లో పరిధిలో కేసు నమోదు చేశారు. దర్యాప్తును ముమ్మరం చేశారు. కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. నిందితుల నుంచి నాటు తుపాకులు, బులెట్లు, సుమారు తొమ్మిది వందల గ్రాముల వెండి వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో ఏడుగురు నిందితులను గుర్తించామని, అరెస్టయిన వారిలో బీహార్ రాష్ట్రంలోని సరన్ జిల్లా శివాన్గ్యాంగ్కు చెందిన ఆశిష్‌కుమార్ సింగ్ (22), దీపక్‌కుమార్ సాహు (22) ఉన్నారని డీసీపి వినీత్‌కుమార్ తెలిపారు.
…………………………………………..