
* ఎన్టీఆర్‌పై టీడీపీ ఎమ్మెల్యే బూతు పురాణం..
* భగ్గుమంటున్న ఎన్టీఆర్ అభిమానులు
* వార్ – 2 సినిమా రిలీజ్ సందర్భంగా వివాదాస్పద వ్యాఖ్యలు
* సోషల్ మీడియాలో ఆడియో వైరల్
ఆకేరు న్యూస్, సినిమా డెస్క్ : ప్రముఖ హీరో, నందమూరి తారక రామారావు మనవడు.. జూనియర్ ఎన్టీఆర్‌పై అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ నోరుపారేసుకున్నారు. ఆయనను తీవ్ర పదజాలంతో దూషిస్తూ మాట్లాడిన ఆడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఎన్టీఆర్ అభిమానులు భగ్గుమంటున్నారు. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద తీవ్రస్థాయిలో ఆందోళన చేపట్టారు. దగ్గుపాటి ప్రసాద్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. దగ్గుపాటి ఎమ్మెల్యే డౌన్.. డౌన్ అంటూ నినాదాలు హోరెత్తించారు.
అసలేం జరిగిందంటే..
అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఎన్టీఆర్‌ను దూషిస్తూ జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల సంఘం నేత ధనుంజయ నాయుడుతో మాట్లాడిన ఆడియో బయటకు వచ్చింది. ఎన్టీఆర్ నటించిన వార్ -2 విడుదల సందర్భంగా అభిమానుల స్పెషల్ షోకు ఆహ్వానించేందుకు ధనుంజయ నాయుడు.. ఎమ్మెల్యేకు ఫోన్ చేసినట్లుగా వైరల్ అవుతున్న ఆడియోను బట్టి అర్థం అవుతోంది. ఆ ఆడియాలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎన్టీఆర్ సినిమాను ఆడనీయమని, పర్మిషన్లు లేవని అన్నారు. అంతేకాదు.. వాడు.. లోకేష్ ను అంటాడా.. అంటూ రాయలేని పదజాలంతో దూషించినట్లుగా ఆడియోలో ఉంది. నారా లోకేష్‌కు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఆడనీయమంటూ, ‘వార్ 2’ షోలను అనంతపురంలో నిలిపివేయాలని హెచ్చరించినట్లుగా కూడా ఆ ఆడియోలో ఉంది. ఇది సోషల్ మీడియాలో వేగంగా వైరల్ కావడంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎమ్మెల్యే పై భగ్గుమంటున్నారు.
అది రాజకీయ కుట్ర
-ఎమ్మెల్యే వెంకటేశ్వర ప్రసాద్
ఆడియో కలకలంపై ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ స్పందించారు. తన ఆడియో మార్ఫింగ్ చేశారని అంటున్నారు. రాజకీయ కుట్రలో భాగంగానే వైరల్ చేశారంటూ వివరణ ఇస్తున్నారు. తన ప్రమేయం లేకుండానే అనవసర కుట్రలు చేస్తున్నారని బదులిచ్చారు. గత పది, 15 రోజుల నుంచి అనంతపురం అర్బన్ రాజకీయాల్లో ఏం జరుగుతుందో అందరికీ తెలుసని, ఆ కుట్రలో భాగంగానే ఇలాంటి పనికి పాల్పడ్డారని అన్నారు. తాను నందమూరి కుటుంబానికి అభిమానినని తెలిపారు. ఆడియో తనది కాదని తెలియజేసుకుంటున్నా అని తెలిపారు. ఆడియో తనది కాకపోయినా.., తన పేరు ప్రస్తావించారు కాబట్టి ఎన్టీఆర్ అభిమానులకు క్షమాపణలు చెబుతున్నా అన్నారు.
………………………………………………