
*మనశ్శాంతి లేక బలవన్మరణాలు..!
* కలవరపెడుతున్న ఆత్మహత్యల గణాంకాలు
* ఆత్మహత్యల్లో తెలంగాణ నాలుగో స్థానం
* మానసిక సమస్యలతో చనిపోతున్న వారే ఎక్కువ
* అస్థిరమైన ఆలోచనలు.. భవిష్యత్‌పై బెంగే కారణాలు
* మాట్లాడితే చాలు.. మరణాన్ని జయించవచ్చంటున్న మానసికవేత్తలు
ఆకేరు న్యూస్, స్పెషల్‌స్టోరీ : మనసు కుంగిపోతోంది. వేదనతో రగిలిపోతోంది. మనకే ఏంటీ దుస్థితి.. ఏదీ కలిసిరావడం లేదు ఎందుకు..? ఇంక బతికి ఏం సాధించాలి.. అనే ఆలోచనలు బలవన్మరణాలకు దారి తీస్తున్నాయి. కుటుంబ సమస్యలు.. అప్పులు.. చదువులో ఒత్తిడి.. ప్రేమ వ్యవహారాలు.. కారణాలేవైనా బలవంతంగా తనువు చాలిస్తున్న వారి సంఖ్య ఏటేటా పెరుగుతోంది. పిల్లల నుంచి పెద్దల వరకు ఆ కేటగిరీలో ఉంటున్నారు. మనసుతో పోరాడలేక, జీవితంలో మనశ్శాంతి లేదంటూ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఆత్మహత్యల రేటులో దేశంలో నాలుగో స్థానంలో తెలంగాణ ఉండడం ఆందోళన కలిగిస్తోంది. జాతీయ క్రైం రికార్డుల బ్యూరో (ఎన్సీఆర్బీ) లెక్కలను గమనిస్తే.. రాష్ట్రంలో 2018లో 7,.845 2021కు ఆ సంఖ్య 10, 171కు చేరడం తీవ్ర ఆందోళన చెందాల్సిన విషయం. ఐదేళ్లలో 43,729 మంది బలవన్మరణాలకు పాల్పడగా ఏటా సగటున 8,746 మంది బలవంతంగా చనిపోతున్నారని ఎన్సీఆర్బీ లెక్కలు పేర్కొంటున్నాయి. వీరిలో ఎక్కువ మంది మానసిక సమస్యలతోనే చనిపోతున్నారని తెలుస్తోంది.
తెలంగాణలో ఇలా..
దేశంలోని 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాల్లో కలిపి మానసిక సమస్యలతో చనిపోతున్న వారి సంఖ్య 2018లో 10,134 ఉంటే, 2022లో ఆ సంఖ్య ఏకంగా 14, 600గా నమోదైంది. వారిలో ఒక్క తెలంగాణలోనే 2,590 మంది మానసిక సమస్యలతో చనిపోయినట్లు ఎన్సీఆర్బీ నివేదికల్లో పేర్కొనడం ఆందోళన కలిగిస్తోంది. వీరిలో మెజార్టీ చదువుకుంటున్న విద్యార్థులు, రైతులే ఉంటున్నారని తెలుస్తోంది. ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాల్లోనే ఈ ఆత్మహత్యలు ఎక్కువగా ఉంటున్నాయి. తెలంగాణతో పాటు కేరళ, తమిళనాడు కూడా ఆత్మహత్యల్లో ముందు వరుసలో ఉంటున్నాయి. ఎన్సీఆర్బీ లెక్కల ప్రకారం దేశ వ్యాప్తంగా చూసుకుంటే కేవలం ఐదేళ్లలో 7,61,148 మంది బలవన్మరణాలకు పాల్పడ్డారు. అంటే దేశంలో లక్ష జనాభాకు సగటున 11.26 రేటుతో ఆత్మహత్యలు నమోదైనట్లు తెలుస్తోంది. సిక్కిం రాష్ట్రంలో అత్యధికంగా ఐదేళ్లలో సగటున 37.5 రేటు (లక్ష జనాభాకు) నమోదైంది. ఛత్తీస్‌గఢ్ 26.42 రేటుతో రెండో స్థానం, 25.44తో కేరళ మూడో స్థానం, 23.3రేటుతో తెలంగాణ నాలుగో స్థానంలో ఉంది. ఇక 21.8 రేటుతో తమిళనాడు ఐదో స్థానంలో ఉంది.
ఆందోళనకు గురి చేస్తున్న అస్థిరమైన ఆలోచనలు
దేశంలో 2021లో 18 ఏళ్లలోపు యువత 10,730 మంది బలవన్మరణాలకు పాల్పడినట్లు నేషనల్ క్రైం రికార్డ్సు బ్యూరో గణాంకాలు చెబుతున్నాయి. వారిలో 864 మంది పరీక్షలలో ఫెయిల్ అయినందుకు చనిపోయారు. 18 ఏళ్ల నుంచి 30ఏళ్లలోపు వారు 56,529 మంది ఆత్మహత్య చేసుకున్నారు. దేశంలో జరుగుతున్న ఆత్మహత్యలలో 8 శాతం మంది విద్యార్థులే ఉంటున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ఆత్మహత్యలకు కచ్చితమైన కారణాలు లేకపోయినా అస్థిరమైన ఆలోచనలు.. భవిష్యత్‌పై బెంగ ప్రధాన కారణాలుగా విశ్లేషిస్తున్నారు. ఓయూలోని సహాయం కౌన్సిలింగ్ కేంద్రం నిపుణులు మాట్లాడుతూ.. అనేక రకాల ఆలోచనలతో విపరీతమైన ఒత్తిడికి గురవుతున్నారని, స్థిరత్వం లేకుండా ఉండిపోతున్నారు. ఎటు వెళ్లాలి.. ఏం చేయాలనే విషయంపై స్పష్టత లేకపోవడంతో ఆందోళనకు గురై బలవన్మరణాలకు పాల్పడున్నారని పేర్కొంటున్నారు. ఒత్తిడికి గురవుతున్న విద్యార్థల సహాయార్థం 2009లో ఉస్మానియా విశ్వవిద్యాయంలో ఈ కేంద్రం ఏర్పాటు చేశారు.
14416 కు కాల్ చేసి మనసు విప్పి మాట్లాడితే..
చిన్న చిన్న కారణాలకే మానసికంగా కుంగిపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారి సంఖ్య పెరుగుతుండడంతో అలాంటి వారి కోసం భారత ప్రభుత్వం టెలి మానస్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఇది మానసిక ఆరోగ్యం మెరుగుపరిచేందుకు సహాయపడుతుంది. 24/7 అందుబాటులో ఉంటుంది. 14416 కు కాల్ చేసి మనసులోని ఆలోచనలను పంచుకోవచ్చు. ప్రజలు ఎప్పుడైనా, ఎక్కడైనా మానసిక ఆరోగ్య సహాయాన్ని పొందవచ్చు. టెలి-మానస్ సేవలు పూర్తి ఉచితం. అంతేకాదు.. కుటుంబ సభ్యులతో పంచుకోలేని విషయాలను కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు. వ్యక్తుల సమాచారం గోప్యంగా ఉంచుతారు. ఇంగ్లీషుతో పాటు 20 కి పైగా ఇతర ప్రాంతీయ భాషలలో సేవలు అందుబాటులో ఉన్నాయి. ఒత్తిడి, ఆందోళన, నిరాశ, ఇతర మానసిక ఆరోగ్య సమస్యలకు టెలీ మానస్ కేంద్రం మార్గదర్శకత్వం చేస్తుంది. తెలంగాణలోని ఎర్రగడ్డ మానసిక వైద్య కేంద్రంలో కూడా ఈ సేవలు అందుతున్నాయి. అక్కడ ఇప్పటి వరకు 1,61,477 మంది ఫోన్ చేసినట్లు కేంద్రం వెల్లడించిది. టెలీ మానస్ కేంద్రంలోని మానసిక నిపుణులు బాధితులకు కౌన్సెలింగ్ ఇచ్చి.. ఆత్మహత్యల ఆలోచనల నుంచి దూరం చేస్తున్నారని వివరించింది. తమకు ఫోన్ చేసి మాట్లాడితే చాలు.. మరణాన్ని జయించవచ్చంటున్న మానసికవేత్తలు భరోసా కల్పిస్తున్నారు.
……………………………………….