
* జస్టిస్ ఘోష్ కమిషన్ నిలిపివేయాలని పిటిషన్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : జస్టిస్ ఘోష్ కమిషన్ ను నిలిపివేయాలని కోరుతూ మాజీ సీఎం కేసీఆర్(Kcr), మాజీ మంత్రి హరీశ్‌రావు (Harishrao) న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా ప్రభుత్వం కమిషన్ వేసిందని పిటిషన్ లో పేర్కొన్నట్లు తెలిసింది. ప్రభుత్వానికి ఎలా కావాలో.., అలాగే నివేదిక సమర్పించారని ఆరోపించారు. కమిషన్ నివేదికను నిలిపివేస్తూ ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ వేశారు. నంబరింగ్ అయ్యాక ఈ పిటిషన్‌పై సింగిల్ జడ్జి విచారణ చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్‌ను నియమిస్తూ 2024 మార్చి 14న ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను కొట్టేయాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావులు హైకోర్టు(Highcourt)లో పిటిషన్లు దాఖలు చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసి రాజకీయ వ్యూహంలో భాగంగా కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని పిటిషన్లో పేర్కొన్నారు. నివేదిక కాపీని అందజేయకుండా ప్రభుత్వం మీడియా ప్రచురణలకు ఇవ్వడంలో దురుద్దేశపూరితం, సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని పేర్కొన్నారు. ఇందులో ప్రతివాదులుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి, జస్టిస్ ఘోష్ కమిషన్‌ను పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పిటిషన్లు హైకోర్టు రిజిస్ట్రీ పరిశీలనలో ఉన్నాయి. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ గత నెల 31న తెలంగాణ ప్రభుత్వానికి తన నివేదికను సమర్పించింది.
…………………………………..