
*విద్యుత్ శాఖ కీలకనిర్ణయం
* ఆకేరున్యూస్, హైదరాబాద్ : హైదరాబాద్ లో ఉన్న కేబుల్ వైర్లను, ఇంటర్నెట్ వైర్లను విద్యుత్ శాఖ తొలగిస్తోంది. ఇటీ వల చోటు చేసుకున్న విషాద ఘటనల నేపధ్యంలో విద్యుత్ శాఖ ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
కృష్ణాష్టమి సందర్భంగా రామాంతాపూర్ ప్రాంతంలో వేడుకల్లో భాగంగా రథం లాగుతూ ఆరుగురు వ్యక్తులు కరెంట్ షాక్ కు గురై మృత్యువాత పడగా నిన్న వినాయకుడి విగ్రహం తరలిస్తుండగా బండ్లగూడ ప్రాంతంలో
విద్యుత్ షాక్ కు గురై ఇద్దరు వ్యక్తులు మృత్యవాత పడ్డారు.
ఈ నేపధ్యంలో విద్యుత్ శాఖ ఇకముందు ఇలాంటి ప్రమాదాలకు తావివ్వకుండా కీలకనిర్ణయం తీసుకుంది. గ్రేటర్ పరిధిలో యమపాశాలుగా మారిన ఇంటర్నెట్, టీవీ కేబుళ్లను తొలగించాలనే నిర్ణయానికి విద్యుత్
శాఖ అధికారులు వచ్చారు.
కరెంట్ స్తంభాలపై టీవీ కేబుల్ వైర్లు, ఫైబర్ నెట్వర్క్ వైర్లు అడ్డగోలుగా ఉన్నట్లు గుర్తించారు. దీంతో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి స్తంభాలపై ఉన్న వైర్లను తొలగిస్తున్నారు అధికారులు. నిన్నటి నుంచి విద్యుత్
స్తంభాలపై ఉన్న వేలాది కేబుల్ వైర్లను, ఫైబర్ నెట్వర్క్ వైర్లను తొలగిస్తున్నట్లు చెప్పారు.
దీంతో కేబుల్, ఇంటర్నెట్ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్లో గణేష్ నిమజ్జనం నాటికి కేబుల్స్ తొలగించాలని విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.
ఎప్పటికప్పుడు విద్యుత్ శాఖ ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఉంటుందని పేర్కొన్నారు.
ఈ మేరకు సిటీలో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్స్ ఏర్పాటును వేగవంతం చేయాలని విద్యుత్ శాఖకు తెలంగాణ సర్కార్ ఆదేశించింది. కేబుళ్ల తొలగింపు కేబుల్ ఆపరేటర్లు, ఫైబర్ నెట్ సంస్థ యజమానులు
ఆందోళనకు దిగారు. కేబుళ్లు ఇలానే తొలగిస్తే.. హైదరాబాద్ నగరమంతా ఇంటర్నెట్ సేవలు ఆపేస్తామని హెచ్చరిస్తున్నారు.
………………………………………