
* హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్
ఆకేరు న్యూస్ హనుమకొండ: మండల మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కుట్టు నైపుణ్య శిక్షణ అభివృద్ధి కేంద్రాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని, కుట్టుకు సంబంధించిన మెలకువలను శిక్షణ కాలంలో నేర్చుకోవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ( COLLECTOR SNEHA SHABBARISH) అన్నారు. బుధవారం హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో మండల మహిళా సమాఖ్య ద్వారా నిర్వహిస్తున్న కుట్టు శిక్షణ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించారు. ఈ శిక్షణ కేంద్రం ద్వారా ఎంతమంది శిక్షణ పొందుతున్నారని, కుట్టు శిక్షణలో ఎలాంటి యంత్రాలను వినియోగిస్తున్నారని కలెక్టర్ శిక్షణ పొందుతున్న మహిళలను అడిగారు. దీనిపై మహిళలు స్పందిస్తూ కుట్టు శిక్షణ కేంద్రంలో 45 మంది మహిళలు కుట్టుకు సంబంధించిన మెలకువలను నేర్చుకుంటున్నామని, వివిధ రకాల దుస్తుల కుట్టుకు అధునాతన కుట్టు మిషన్ల ద్వారా శిక్షణ ద్వారా నేర్చుకుంటున్నట్లు బదులిచ్చారు. శిక్షణా కేంద్రంలో మహిళలు కుట్టు మిషన్ల ద్వారా కుడుతున్న విధానాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు. టెక్స్టైల్ పార్కులో ఉపాధి అవకాశం వచ్చినా రాకున్నా స్వయం ఉపాధి ద్వారా సొంత కాళ్లపై నిలబడే అవకాశం లభిస్తుందన్నారు. గ్రామాలలో సొంతంగా కుట్టు ను ఏర్పాటు చేసుకుని ఆర్థిక అభివృద్ధిని సాధించాలన్నారు. కుట్టు మిషన్ల కొనుగోలుకు అవసరమైతే మహిళా సంఘాల ద్వారా కొనుగోలు చేసేందుకు చర్యలు చేపట్టాలని డిఆర్డిఓ మేన శ్రీనుకు కలెక్టర్ సూచించారు.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పరిశీలించిన కలెక్టర్
ఆత్మకూరులో పురోగతిలో ఉన్న పలు ఇందిరమ్మ ఇండ్లను జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ పరిశీలించారు. ఇండ్ల నిర్మాణ పనులకు సంబంధించిన వివరాలను అధికారులు, లబ్ధిదారులతో కలెక్టర్ మాట్లాడారు. ఇండ్ల నిర్మాణానికి ఇసుక, కంకర, సిమెంటు, ఇటుకలు, స్టీల్, తదితర సామగ్రి ఎక్కడ నుండి, ఎంతెంత రేట్లకు తెచ్చుకుంటున్నారని లబ్ధిదారును కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇండ్ల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పురోగతి గురించి ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డిని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు తహసీల్దార్ జగన్మోహన్ రెడ్డి, డిపిఎం రాజేంద్రప్రసాద్, ఏపీఎం సుజాత, తదితరులు పాల్గొన్నారు.
……………………………………………