
* పార్లమెంట్ లో ఎంపీ కడియం కావ్య
ఆకేరు న్యూస్ డెస్క్ : ప్రధాని ఉపాధి కల్పన పథకం ద్వారా గ్రామీణ ప్రాంత యువకులకు వ్యాపార అవకాశాలు కల్పించాలని ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ యువతను ప్రోత్సహించాలని ఎంపీ కడియం కావ్య అన్నారు. గురువారం ఢిల్లీలో జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో ఎంపీ కావ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రధాని ఉపాధి కల్పన పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో చిన్న చిన్న వ్యాపారాలు పెరుగుతున్నాయని, ఇందులో SC యువతకు ఎక్కువ సబ్సిడీలు కల్పించడం వల్ల వారికి వ్యాపారం చేయడం సులభమవుతుందని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. SC/ST హబ్ ఉన్న వరంగల్ లో ప్రధాని ఉపాధి కల్పన పథకం ద్వారా యువతకు శిక్షణ, నైపుణ్యాలు, మార్కెట్ అవకాశాలు, ప్రభుత్వ కొనుగోళ్లలో భాగస్వామ్యం కల్పిస్తే యువత ఆర్థికాభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుందని అన్నారు. ఎంపీ కడియం కావ్య అడిగిన ప్రశ్నకు సూక్ష్మ, చిన్న & మధ్య తరహా పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే ఈ మేరకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ప్రధాని ముద్రా యోజన (PMMY) పథకం ద్వారా వడ్డీ లేకుండా 20 లక్షల రూపాయల వరకు రుణాలు లభ్యమవుతున్నాయని తెలిపారు.అయితే, వరంగల్లో ఇన్నోవేషన్ కోసం అవసరమైన ఇంక్యుబేషన్ సెంటర్ లేకపోవడంపై వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య నిరాశ వ్యక్తం చేశారు. వరంగల్ లో ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటు కోసం తాను నిరంతరం కృషి చేస్తానని ఎంపీ డాక్టర్ కడియం కావ్య స్పష్టం చేశారు.
………………………………..