
– సైబర్ ఖాతాలపై కన్నేయండి!”
– ఒక్క ఏడాదిలో 48 శాతం పెరిగిన సైబర్ నేరాలు
– బాధితులకు బాసటగా నిలవాలని సూచనలు
ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ : ఇప్పుడు జరుగుతున్నవి.. జరగబోయేవి.. పెరిగేవి సైబర్ దొంగతనాలే. పోలీసులు, ప్రభుత్వం ఎంతలా అవగాహన కల్పిస్తున్నా నేరగాళ్ల కొత్త ఎత్తులకు అమాయకులు బలవుతున్నారు. ఆర్థికంగా చితికిపోతున్నారు. అమాయకులనే కాదు.. విద్యావంతులను, ప్రతిభావంతులను, ప్రముఖులను కూడా వారు బురిడీ కొట్టిస్తున్నారు. నగరానికి చెందిన ప్రముఖ వైద్యుడికి గుర్తుతెలియని నంబర్ నుంచి స్కైప్ కాల్ వచ్చింది. ఈడీ అధికారినని పరిచయం చేసుకున్న అతడు మీ ఖాతాల ద్వారా డబ్బు విదేశాల్లో ఉంటున్న నేరస్తులకు వెళ్లిందని.. దానికి సంబంధించి కేసులు నమోదయ్యాయని చెప్పి భయపెట్టాడు. కేసు నుంచి తప్పిస్తానంటూ పలు దఫాలుగా రూ. 40 లక్షలు కాజేశాడు.
సొత్తు తరలింపుపై పోలీసుల దృష్టి
టెక్నాలజీని ఆసరాగా చేసుకుని చేస్తున్న సైబర్ నేరాలను అరికట్టడం పోలీసులకు కత్తిమీద సాముగా మారింది. ఈ నేపథ్యంలో దోచుకున్న సొత్తు తరలింపుపై పోలీసులు దృష్టి సారించాలని భావించారు. దొంగల ఖాతాల్లోకి మరలకుండా అడ్డుకట్టవేస్తే బాధితుల నష్టాన్ని కొంత వరకు నివారించవచ్చని భావిస్తున్నారు. ఈనేపథ్యంలో రాచకొండ సీపీ సుధీర్‌బాబు నేరేడ్మెట్ కమిషనరేట్‌లో బ్యాంకు అధికారులతో బుధవారం సీపీ సమావేశం అయ్యారు. నేరాల పెరుగుతున్న తీరును, వారి ఖాతాల వినియోగిస్తున్న విధానాలను వివరించారు.
ఒక్క ఏడాదిలో 48 శాతం
బ్యాంకర్లు, బ్యాంకింగ్ నిపుణులు సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన బాధితులకు అండగా నిలవాలని సీపీ సూచించారు. వారి మానసిక వేదనను అర్ధం చేసుకునే యత్నం చేయాలని కోరారు. ఏటా పెరుగుతున్న సైబర్ నేరాల తీరును వారికి వివరించే ప్రయత్నం చేశారు. సాధారణ నేరాలు తగ్గి సైబర్ నేరాలు ఏటికేడు పెరుగుతున్నాయని, 2023తో పోల్చితే 2024లో సైబర్ నేరాలు 48 శాతం పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. లావాదేవీల పరిమితిని బట్టి సైబర్ నేరగాళ్లు ఉపయోగించే బ్యాంకు ఖాతాలను గుర్తించడం, వాటిని ప్రీజ్ చేయడం, బాధితులకు డబ్బు రీఫండ్, కేవైసీ, ఏఓఎఫ్ తదితర అంశాలపై బ్యాంకు అధికారులకు పలు సలహాలు, సూచనలు అందించారు.
…………………………………………………………..