
* సురవరం ప్రతాప్‌రెడ్డికి నివాళులర్పించిన ప్రముఖులు
* సీఎం రేవంత్ రెడ్డి, వెంకయ్య సందర్శన
*సురవరం లేఖతోనే ఆ వర్సిటీ పేరు మార్చామన్న రేవంత్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : సీపీఐ జాతీయ మాజీ ప్రధానకార్యదర్శి, నల్లగొండ మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి భౌతిక కాయానికి సీఎం రేవంత్ రెడ్డి (Revanthreddy) నివాళులర్పించారు. హిమాయత్ నగర్‌లోని మఖ్దూమ్ భవన్‌కి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి.. నివాళులు అర్పించి.. ఆయన సేవల్ని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సురవరం రాసిన లేఖ వల్లే తెలుగు యూనివర్సిటీ పేరు మార్చామని వెల్లడించారు. త్వరలో తాను సురవరంతో మాట్లాడతానని చెప్పానని, అంతలోనే ఇలా జరగడం బాధాకరమన్నారు. సిద్ధాంతపరమైన రాజకీయాలను చేసిన ఆయన మరణం తీరని లోటని రేవంత్ పేర్కొన్నారు. అలాగే, ఏఐసీసీ, కాంగ్రెస్, ప్రభుత్వ పక్షాల తరఫున కూడా సురవరానికి నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపారు.
నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడిన వ్యక్తి : వెంకయ్యనాయుడు
తాను నమ్మిన సిద్దాంతం కోసం బాల్యం నుంచీ పనిచేసి, కట్టుబడిన వ్యక్తి సురవరం సుధాకర్ రెడ్డి అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు (Venkayya Naidu) అన్నారు. వివిధ బాధ్యతల్లో, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటూ నిరంతరం పేదల తరఫున పోరాడిన వ్యక్తి అని కొనియాడారు. మంచివ్యక్తి, మానవతా వాది అయిన సురవరం మరణం చాలా విచారకరం అన్నారు. పేదల పక్షాన ఆయన ఎప్పుడూ పోరాడేవారని మరోసారి గుర్తు చేశారు.
……………………………………….