
*ప్రభుత్వం నుంచి సబ్సిడీలు సద్వినియోగం చేసుకోవాలి
*మొక్కల సక్రమ నిర్వహణతో ముప్పై ఏండ్లపాటు ఆదాయం
*మార్కెటింగ్, కోతుల, కూలీల ఇబ్బందులు లేవు
*ఆయిల్ ఫామ్ పంట సాగుకు ఆసక్తి చూపుతున్న జిల్లా రైతులు
ఆకేరు న్యూస్ సిరిసిల్ల : మార్కెటింగ్, కోతులు, కూలీల ఇబ్బందులు లేని ఆయిల్ పామ్ పంట సాగు విస్తీర్ణం రాజన్న సిరిసిల్ల జిల్లాలో క్రమంగా పెరుగుతోంది. పంట సాగు చేసే రైతులకు ప్రభుత్వం సబ్సిడీలు, మద్దతు అందిస్తూ భరోసా ఇస్తున్నది. అంతర పంటల సాగుతో రైతులకు అదనపు ఆదాయం సమకూరుతున్నది. జిల్లాలోని పలు మండలాల్లో పంట చేతికి రావడంతో రైతుల్లో మరింత ఆత్మవిశ్వాసం పెరుగుతున్నది. దేశంపై దిగుమతుల భారం తగ్గి.. నూనె గింజల సాగులో స్వయం సమృద్ది సాకారమవుతున్నది.ప్రపంచంలో అత్యధిక దిగుబడిని ఇచ్చే నూనె గింజల పంటలో ఆయిల్ పామ్ పంట ఒకటి. మన దేశంలో వంటలో ఉపయోగించే నూనెలో పామ్ ఆయిల్ వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఇంతగా డిమాండ్ ఉన్నా మన దేశంలో పామ్ ఆయిల్ సాగు బాగా తక్కువ ఉంది. దీంతో మలేషియా, ఇండోనేషియా నుంచి దిగుమతి చేసుకుంటున్నాము. దేశం ముడి చమురు (పెట్రోల్, డీజిల్) తర్వాత ఎక్కువగా పామ్ ఆయిల్ (ఆయిల్ పామ్ చెట్ల నుంచి వచ్చిన గెలలతో తీసిన ఆయిల్)ని దిగుమతి చేసుకుంటుంది. వంట నూనెలో దీని వాటా ఎక్కువగానే ఉంటుంది. గత 100 ఏండ్ల నుంచి దేశం వంట నూనె డిమాండ్ లో దిగుమతి భారీగానే చేసుకుంటూనే ఉంది.
4వ సంవత్సరం నుంచి దిగుబడి…
ఆయిల్ పామ్ సాగు మొదలు పెట్టిన 4వ సంవత్సరం నుంచి దిగుబడి వస్తుంది. 4-6వ సంవత్సరం వరకు 5 నుంచి 7 టన్నులు దిగుబడి వస్తుంది. 7వ సంవత్సరం నుంచి 10-15 టన్నులు దిగుబడి వస్తుంది. ప్రీ-యునిక్ కంపెనీ వారు పంట గెలలు కొనుగోలు చేస్తారు.బంగారు పంట మీద ఎక్కువగా శ్రద్ధ..
ఇంత డిమాండ్ ఉన్న పంట కాబట్టే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ బంగారు పంట మీద ఎక్కువగా శ్రద్ధ చూపించి రైతులకు తోడ్పాటుగా మొక్కలు, డ్రిప్ మీద సబ్సిడీపై అందిస్తున్నాయి. ఆయిల్ పామ్ పంట సాగు నిర్వహణ చాలా సులువు. చీడ, పీడల, కోతులు, ఇతర అటవీ జంతువుల బెడద ఉండదు. ఉద్యానవన శాఖ అధికారుల సూచనలు, సలహాల మేరకు పంట సాగు చేస్తే అధిక దిగుబడి, ఆదాయం సొంతం చేసుకోవచ్చు. జిల్లాలో పట్టా భూములు ఉన్న రైతులు అర్హులు. ఒక ఎకరం నుంచి ఎన్ని ఎకరాల్లో అయినా సాగు చేసే వారికి సబ్సిడీ అందుతుంది. ఎస్సీ, ఎస్టీ రైతులకు డ్రిప్ పరికరాలకు 100 శాతం సబ్సిడీ, చిన్న, సన్నకారు రైతులకు 90 శాతం సబ్సిడీ, ఓసీలకు చెందిన రైతులకు 80 శాతం సబ్సిడీ అందజేయనున్నారు. ఎకరం విస్తీర్ణంలో 50 మొక్కలు నాటుతారు. ఒక్కో మొక్క విలువ మార్కెట్లో రూ.200 ఉండగా, రైతులందరికీ 90 శాతం సబ్సిడీ వర్తింపజేస్తూ కేవలం రూ.20కే అందజేస్తారు. మొక్కలు, డ్రిప్, ఇతర సహాయం అన్ని కలిపి ఒక ఎకరానికి ప్రభుత్వం రూ. 52 వేల వరకు సబ్సిడీ నాలుగు ఏండ్లపాటు అందజేస్తుంది.
అంతర పంటలతో అదనపు ఆదాయం..
ఆయిల్ పామ్ పంట దిగుబడి మూడో ఏడాది గడిచిన తరువాత మొదలు అవుతుంది. రైతులకు ఆయిల్ పామ్ లో అంతర్ పంటల ద్వారా మొదటి మూడు సంవత్సరాలు ఆదాయం లభిస్తుంది. వరి, చెరుకు మినహా అన్ని కూరగాయలు, ఇతర మొక్కలు సాగు చేసుకోవచ్చు.
లక్ష్యం దిశగా అడుగులు…
జిల్లాలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి 2 వేల ఎకరాలలో ఆయిల్ పామ్ పంట సాగు విస్తీర్ణం లక్ష్యం కాగా ఇప్పటివరకు 1160 ఎకరాల గల 331 రైతులు ఆయిల్ పామ్ సాగుకు ఆసక్తి చూపించారు. 120 ఎకరాలలో ప్లాంటేషన్ పూర్తి చేయడం జరిగింది. మిగితా రైతులు ఆసక్తి చూపుతున్నారు. జిల్లాలో మొత్తం ఇప్పటిదాకా 2300 ఎకరాలకు పైగా సాగులో ఉంది.టన్ను రూ.18 వేలకు పైగా ధర 2022 సంవత్సరంలో బోయినపల్లి, ఇల్లంతకుంట, ముస్తాబాద్, వీర్నపల్లి, తంగళ్లపల్లి మండలాల్లో 292 మంది రైతులు 978 ఎకరాలలో ఆయిల్ పామ్ వేయగా, ఈ ఏడాది 450 టన్నుల వరకు దిగుబడి రానున్నదని అంచనా. ఇప్పటిదాకా 16 టన్నుల వరకు పంటను కోసి, పరిశ్రమకు తరలించారు. ఒక్కో టన్నుకు 18,052 రూపాయలకు పైగా ధర లభించింది. కంపెనీ వారే వచ్చి ఆయిల్ పామ్ ఉత్పత్తులు సేకరిస్తారు. వారం రోజుల్లో రైతుల బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయి.
మార్కెటింగ్ కు అవకాశం దళారీలు ఉండరు.
రైతులు ఆయిల్‌పామ్ పంట సాగు పై దృష్టి సారించి ఆర్ధికంగా అభివృద్ది పొందాలి. ఆసక్తి ఉన్న రైతులు తమ సమీపంలోని ఉద్యానవన శాఖ అధికారులు వీ గోవర్ధన్ , ఉద్యాన అధికారి ( సిరిసిల్ల డివిజన్) -89777 14049, సీ హెచ్ లోకేష్, ఉద్యాన అధికారి (వేములవాడ డివిజన్) 89777 14048, వ్యవసాయ విస్తీర్ణ అధికారి లేదా ఆయిల్ పామ్ కంపెనీ సిబ్బందిని సంప్రదించాలి.
నాలుగు ఎకరాల్లో వేసిన…
– లెంకల చంద్రశేఖర్ రెడ్డి, మర్లపేట, బోయినపల్లి మండలం
ఆయిల్ పామ్ సాగు గురించి అధికారులు చెబితే నాలుగు ఎకరాల్లో వేసిన. సాగులో ఎలాంటి ఇబ్బందులు లేవు. నిర్వహణ చాలా సులువు. చీడ పీడల బాధ లేదు. అధికారుల సూచనల మేరకు సాగు చేసాను. మంచి దిగుబడి తో రూ.50 వేల వరకు ఆదాయం వచ్చింది..
50 వేల ఆదాయం వస్తోంది
– చంద విజయకుమార్, తెర్లుమద్ది, ముస్తాబాద్ మండలం
నేను ఐదు ఎకరాల్లో పంట సాగు చేసాను. యాజమాన్య పద్దతులు పాటించాను. మూడు కోతల్లో కలిపి మూడువేల కిలోల వరకు వరకు దిగుబడి వచ్చింది. దాదాపు రూ. 50 వేలకు పైగా ఆదాయం సమకూరింది. నాలుగో సంవత్సరం నుంచి ప్రతి నెలా ఆదాయం వస్తుంది.
ప్రభుత్వ సహాయాన్ని వినియోగించుకోవాలి
– సందీప్ కుమార్ ఝా, కలెక్టర్
ఆయిల్ పామ్ సాగుతో రైతులకు ఎంతో మేలు చేకూరుతుంది. అందరూ వేసే పంటలు కాకుండా దీనిని వేస్తే నాలుగో సంవత్సరం నుంచి 30 ఏండ్లపాటు ఆదాయం వస్తుంది. ప్రభుత్వ సబ్సిడీలు సద్వినియోగం చేసుకొని, యాజమాన్య పద్దతులు పాటించి అధిక దిగుబడి పొందాలి. ఆర్థికంగా లాభం పొందాలి.
…………………………………………….