
* వివాదాస్పదంగా తెలంగాణ రైజింగ్.. రేవంత్ గణపతి
ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ
అభిమానం హద్దులు దాటితే ఇది హైదరాబాద్హబీబ్నగర్ లో ఏర్పాటు చేసిన విగ్రహంలా ఉంటుందనే చర్చ సోషల్మీడియాలో జోరుగా జరుగుతోంది. అందుకు కారణం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గెటప్, షూతో ఉండి తల మాత్రం వినాయకుడి ఆకారంలో విగ్రహం తయారు చేయడమే. వినాయక చవితి సందర్భంగా హబీబ్ నగర్లో కాంగ్రెస్ పార్టీ నేత, తెలంగాణ మత్స్యశాఖ ఫెడరేషన్ చైర్మెన్ మెట్టు సాయికుమార్ ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. వినాయక మండపాన్ని సైతం తెలంగాణ రైజింగ్ అనే హోర్టింగ్ లతో నింపేశారు. ఇలా ఏకంగా సిఎం రేవంత్ రెడ్డిని వినాయకుడి రూపంలో మార్చి , నవరాత్రి పూజలు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హిందువుల మనోభావాాలు దెబ్బతీస్తున్నారంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేయడమే కాదు.. దాన్ని తొలగించాలంటూ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పోలీసులకు కూడా పిర్యాదు చేశారు.
సోషల్ మీడియాలో వైరల్
నేను హబీబ్ నగరంలో సీఎం రేవంత్ రెడ్డి రూపంలో ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహాన్ని చూశాను. మెట్టు సాయికుమార్ ఏర్పాటు చేసిన విగ్రహం హిందూ మనోభావాలను దెబ్బతీసేలా ఉంది. రేవంత్ రెడ్డిపై అభిమానం ఉంటే ఉండొచ్చు., కానీ రేవంత్ రెడ్డి మాకు దేవుడు కాదు. ఇలా దేవుడిని అవమానించేలా రేవంత్ రెడ్డి రూపంలో వినాయక విగ్రహం ఏర్పాటు చేయడం సరైనది కాదు. హైదారాబాద్ పోలీసుశాఖ వెంటనే ఈ విగ్రహాన్ని తొలిగించాలి. ఇక్కడ రేవంత్ రెడ్డి రూపంలో వినాయకుడికి పూజలు చేయడం ఆపేలా చర్యలు తీసుకోవాలి. మత సామరస్యాన్ని కాపాడేలా చర్యలు తీసుకోవడంతోపాటు, సాధ్యమైనంత త్వరగా విగ్రహాన్ని తొలిగించాలి అని రాజాసింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆప్పటి నుంచీ ఈ విగ్రహంపై చర్చ జరుగుతోంది.
అందులో తప్పేముంది అంటున్న..
అయితే.. కాంగ్రెస్ కార్యకర్తలు, రేవంత్ రెడ్డి అభిమానులు మాత్రం అందులో తప్పేముందని ప్రశ్నిస్తున్నారు. కొందరు సినీ హీరోలుగా, క్రికెటర్లుగా విగ్రహాలను తయారు చేయించి పూజలు చేయడం లేదా అంటున్నారు. కొందరికి నచ్చినా, నచ్చకపోయినా వినాయక నవరాత్రులు అయ్యే వరకూ గణపతికి పూజలు కొనసాగిస్తామని పేర్కొంటున్నారు. విగ్రహాన్ని ఏర్పాటు చేసిన మెట్టు సాయికుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచవ్యాప్తంగా అగ్రగామి రాష్ట్రంగా నిలిపాలని రేవంత్ రెడ్డి పడుతున్న తపనకు ఆ వినాయకుడి ఆశీస్సులు ఉండాలనే ఉద్దేశ్యంతోనే ఇక్కడ వినాయకుడి రూపంలో సిఎం రేవంత్ రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేశామని అంటున్నారు. వినాయక నవరాత్రులు ఘనంగా కొనసాగుతున్న మహానగరంలో మొత్తం ఈ విగ్రహం చుట్టూ అనేక చర్చోపచర్చలు జరుగుతున్నాయి. కొందరు భక్తులు మాత్రం గణపయ్య.. ఇదేం అభిమానమయ్యా అని ప్రశ్నిస్తున్నారు.
……………………………………….