ఆకేరు న్యూస్ డెస్క్ : తండ్రి చనిపోతే ఉద్యోగం వస్తుందన్న దురాలోచనతో తండ్రిని కొడుకు హతమార్చిన సంఘటన కర్నూలు జిల్లాలోని కోడుమూరు మండలం పులకుర్తిలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల సమాచారం మేరకు పులకుర్తికి చెందిన రామాచారి (57) ఎమ్మిగనూరు డిపోలో ఆర్టీసీ డ్రైవర్. ఆయనకు భార్య వీరుపాక్షమ్మ, కుమారుడు వీరసాయి, కుమార్తె ఉన్నారు. డిగ్రీ చదివిన వీరసాయి పలుచోట్ల పనులు చేస్తూ వదిలేశాడు. ప్రస్తుతం ఓ మెడికల్ స్టోర్లో పనిచేస్తున్నాడు. గ్రామంలో ప్రభుత్వ ఉద్యోగి ఒకరు అనారోగ్యంతో చనిపోవడంతో ఆయన కుమారుడికి ఉద్యోగం వచ్చింది. ఈ విషయం తెలిసినప్పటి నుంచి వీరసాయికి దురాలోచన పుట్టింది. అప్పటికే మతిస్థిమితంలేనట్లుగా తయారైన అతడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో బుధవారం రాత్రి నిద్రిస్తున్న తండ్రిని రోకలి బండతో నుదిటిపై చితకబాదాడు. ఆయన చనిపోగా..ఆ తర్వాత తండ్రి కాళ్లను పట్టుకుని ఏడ్చాడు. అలికిడికి ఇరుగుపొరుగువారు వచ్చి చూసి, 108 వాహనానికి సమాచారం అందించారు. సిబ్బంది వచ్చి పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. సీఐ తబ్రెజ్, ఎస్ ఐ ఘటన స్థలానికి చేరుకొని ఇంట్లోనే ఉన్న నిందితుడు వీరసాయిని అదుపులోకి తీసుకున్నారు.
………………………………………
