* నిమజ్జనం వేళ పోలీసుల ట్రాఫిక్ ఆంక్షలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : హైదరాబాద్(Hyderabad)లో గణేశ్ నిమజ్జనం కోలాహలం కొనసాగుతోంది. నిన్న 9వ రోజు సందర్భంగా భారీ ఎత్తున నిమజ్జనాలు జరిగాయి. హుస్సేన్‌సాగర్, ఐడీఎల్ లేక్(Idl Lake), సరూర్‌నగర్ బండ్ తదితర ప్రాంతాల్లో ఎక్కువగా నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. రేపు మహా నిమజ్జనం జరగనుంది. ఈక్రమంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు కొన్ని చర్యలు చేపట్టారు. పలు రూట్లలో వాహనాల రాకపోకలను నిషేధించడం, దారి మళ్లించడం చేసినట్లు వెల్లడించారు. వినాయకుల ప్రధాన రూట్ కట్ట మైసమ్మ ఆలయం నుంచి హుస్సేన్‌సాగర్ వరకు మొత్తం 13 కి.మీ.లు మేర ఆంక్షలు ఎక్కువగా ఉంటాయని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ప్రధానంగా బాలాపూర్ (Balapur) గణపతి కేశవగిరి, చాంద్రాయణగుట్ట పైవంతెన తర్వాత ఎడమవైపు తీసుకుని, మహబూబ్‌నగర్ క్రాస్‌రోడ్డు మీదుగా ఫలక్‌నూమా రైల్వే ఓవర్ బ్రిడ్జి, అలియాబాద్, నాగులచింత-చార్మినార్, మదీనా, అఫ్జల్‌గంజ్, ఎస్‌ఏబజార్, ఎంజే మార్కెట్, అబిడ్స్(Abids), బషీర్‌బాగ్, లిబర్టీ జంక్షన్, అంబేడ్కర్ విగ్రహం నుంచి ఎన్టీఆర్ మార్గ్, పీవీఎన్ఆర్ మార్గం వైపు శోభాయాత్ర సాగనుంది. ఈ మార్గాల్లో గణపతి విగ్రహాలు లేని ఏ వాహనాన్నీ అనుమతించమని పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ (CV. Anand) తెలిపారు. సెప్టెంబర 6వ తేదీన ఉదయం 6 నుంచి 7వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు. ట్రాఫిక్ మళ్లింపు ఆర్టీసీ బస్సులకూ కూడా వర్తిస్తుందని పోలీసులు చెబుతున్నారు. ప్రైవేటు బస్సులను 6వ తేదీ ఉదయం 8 నుంచి 7వ తేదీ 10 గంటల వరకు నగరంలోకి అనుమతించరు.
…………………………………………………
