
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం కాళేశ్వరం కేసుపై అధికారులతో సమావేశమై, అనంతరం శ్రీశైలం వెళ్లారు. శ్రీశైలం నుంచి శనివారం ఉదయం వస్తుండగా ఉన్నట్టుండి ఆయన అనారోగ్యానికి గురయ్యారు. ఆయనను చికిత్స నిమిత్తం హుటాహుటిన హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు సీబీఐ సీనియర్ అధికారులు అపోలో ఆస్పత్రికి చేరుకుని పరామర్శించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ నెల 1న తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ కేంద్రానికి అధికారికంగా లేఖ రాసింది. దీంతో సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ స్వయంగా శుక్రవారం హైదరాబాద్కు వచ్చారు. అనంతరం అస్వస్థత చోటు చేసుకుంది. అస్వస్థతకు గల కారణాలు ఇంకా వెల్లడి కాలేదు.
………………………………..