
* ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం దుష్ప్రచారం
* రేవంత్ ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలి
* కాళేశ్వరం కూలేశ్వరం అన్న నోళ్లే.. ఇప్పుడు శంకుస్థాపనలు
* మాజీ మంత్రి కేటీఆర్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : పొద్దున్న లేస్తే కాళేశ్వరంపై దుష్ప్రచారం చేసే కాంగ్రెస్ ప్రభుత్వం.. అవే నీటిని ఇప్పుడు మల్లన్నసాగర్ నుంచి తీసుకొచ్చి మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టును ప్రారంభించడంపై మాజీ మంత్రి కేటీఆర్ (KTR) తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కాళేశ్వరంపై కాంగ్రెస్ ప్రభుత్వం దుర్మార్గంగా దుష్ప్రచారం చేస్తోందని అన్నారు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు ప్రారంభోత్సవంపై తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. తల వద్ద కాకుండా తోక వద్ద అంటే.. మల్లన్నసాగర్ (MALLANNA SAGAR) వద్ద కాకుండా గండిపేట వద్ద ప్రారంభోత్సవం చేస్తున్నారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును విమర్శించే రేవంత్‌కు.. మల్లన్నసాగర్ వద్ద శంకుస్థాపన చేయడానికి ముఖం చెల్లక ఈరోజు గండిపేట వద్ద డ్రామా చేస్తున్నారని అన్నారు. కాళేశ్వరం కూలేశ్వరం అన్న నోళ్లే.. ఈరోజు అదే నీళ్లు తీసుకొచ్చి హైదరాబాద్ (HYDERABAD) ప్రజలకు గోదావరి జలాలను అందిస్తామని చెప్పకనే చెప్పారన్నారు. కొండపోచమ్మ నుంచి గంగమల్లకు నీరు తరలించడానికి శంకుస్థాపనలు, మల్లన్నసాగర్ నుంచి గండిపేటకు నీళ్లు తరలించేందుకు శంకుస్థాపనలు ఎలా చేస్తున్నారని, అవి కాళేశ్వరం నీళ్లు కాదా అని ప్రశ్నించారు. మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు ప్రారంభించారని, మల్లన్నసాగర్ నుంచి గండిపేటకు తెస్తున్నవి కాళేశ్వరం నీళ్లు కావా అని అన్నారు.
ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలి
ప్రతిపక్షం నుంచి ఇప్పటి వరకు కాళేశ్వరాన్ని విఫల ప్రాజెక్టుగా చెప్పే ప్రయత్నం చేసిన ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలన్నారు. ఎంత దుర్మార్గుడైనా సొంత రాష్ట్రాన్ని బద్నాం చేయరని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం (KALESWARAM) అంటే ఒక రిజర్వాయర్ కాదని, ఒక కాలువ కాదని మల్లన్నసాగర్ అని, కొండపోచమ్మ సాగర్ అని, బసవాపూర్ అని, రాజరాజేశ్వర సాగర్ మిడ్ మానేరు అని, మూడు బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 141 టీఎంసీల స్టోరేజీ కెపాసిటీ అని కేటీఆర్ వివరించారు. కాళేశ్వరం ద్వారా ఒక్క ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వలేదని దుష్ప్రచారం చేశారని తెలిపారు. 94 వేల కోట్ల ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందని ఎలా అంటారని ప్రశ్నించారు. ప్రజల సొమ్ము ఎక్కడ వృథా అయిందో ముఖ్యమంత్రి చెప్పాలన్నారు. రాహుల్ తప్పుబట్టే సీబీఐకి రేవంత్ కాళేశ్వరం కమిషన్ ను అప్పగించారని అన్నారు. కాళేశ్వరాన్ని, కేసీఆర్ (KCR)ను బద్నాం చేసినందుకు ముక్కు నాలుక రాసి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
……………………………………