
* ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనడంపై బీఆర్ ఎస్ స్పష్టత
* అన్ని రకాలుగానూ ఆలోచనల అనంతరం నిర్ణయం : సురేశ్ రెడ్డి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనడంపై బీఆర్ ఎస్ క్లారిటీ ఇచ్చింది. ఆ ఎన్నికల్లో తాము పాల్గొనడం లేదని ఆ పార్టీ ఎంపీ సురేశ్ రెడ్డి స్పష్టం చేశారు. ఎన్నిక బ్యాలెట్ లో నోటా లేదని, అందుకే అన్ని రకాలుగానూ ఆలోచనల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. బీఆర్ ఎస్ (BRS) కు లోక్‌సభలో ప్రాతినిధ్యం లేకపోయినప్పటికీ, రాజ్యసభలో నలుగురు ఎంపీలు ఉన్నారు. కేఆర్ సురేశ్‌రెడ్డి, పార్థసారథిరెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, దామోదరరావు బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులుగా కొనసాగుతున్నారు. ఈ క్రమంలో వారి మద్దతు ఎవరికి అనే చర్చ కొంత కాలంగా జరుగుతోంది. రేపు జరగనున్న ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో (Vice President Election) ఎన్డీయే అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్(RADHAKRISHNAN), ఇండి కూటమి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్‌రెడ్డి (JUSTICE SUDARSAN REDDY)బరిలో ఉన్నారు. ఎవరికి కూడా తమ మద్దతు తెలపకుండా అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ రెండు పార్టీలకూ సమదూరం పాటించాలనే ఆలోచనలో బీఆర్ ఎస్ ఉన్నట్లు వెల్లడైంది. ఉప రాష్ట్రపతి ఎన్నిక బ్యాలెట్‌పై నోటా అందుబాటులో లేదు కాబట్టి ఎన్నికకు దూరంగా ఉండాలని నిర్ణయించినట్లు ఎంపీ సురేశ్ రెడ్డి తెలిపారు. తమ నిరసనను ఈ రకంగా వ్యక్తం చేస్తున్నట్లు ఆయన చెప్పారు. పోటీల్లో ఉన్న ఇద్దరు అభ్యర్థులను అమితంగా గౌరవిస్తున్నామని, ఆ అభ్యర్థులు వారివారి రంగాల్లో నిష్ణాతులని, ఓ అభ్యర్థి స్వంత రాష్ట్రానికి చెందిన వ్యక్తే అని, కానీ.. రైతులను ప్రభుత్వాలు విస్మరిస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఎన్నికకు దూరంగా ఉంటున్నట్లు ఆయన చెప్పారు.
……………………………………….