* పార్లమెంట్ భవనాన్ని చుట్టుముట్టిన ప్రజలు
* పోలీస్ కాల్పుల్లో 14 మంది మృతి
* ముగ్గురు జర్నలిస్టులకు గాయాలు
ఆకేరు న్యూస్ డెస్క్ : నేపాల్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. యువత ప్రభుత్వంపైకి తిరుగుబాటు చేసింది. నేపాల్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా సోషల్ మీడియా యాప్ లను నిషేధించిన నేపధ్యంలో ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా ప్రజలు ఆందోళనలకు దిగారు. పార్లమెంట్ భవనాన్ని చుట్టుముట్టారు. పార్లమెంట్ మెయిన్ గేట్ బద్ధలు కొట్టి లోపలికి ప్రవేశించారు. ప్రవేశ ద్వారానికి నిప్పుపెట్టారు. దీంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. అయినా యువత వెనక్కి తగ్గలేదు. ఈ నేపథ్యంలోనే పోలీసులు రబ్బరు బుల్లెట్లతో వారిపై కాల్పులు జరిపారు.
ఈ కాల్పుల్లో 14 మంది చనిపోగా.. దాదాపు 100 మంది దాకా గాయపడినట్లు తెలుస్తోంది. గాయపడ్డవారిలో ముగ్గురు జర్నలిస్టులు కూడా ఉన్నట్లు సమాచారం. దేశంలో ఉన్న పరిస్థితుల నేపధ్యంలో దేశంలోని సున్నిత ప్రాంతాల్లో ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది. బనేశ్వోర్, లాయిన్ చౌర్లతోపాటు పలు సున్నిత ప్రదేశాల్లో కర్ఫ్యూ విధించింది. నేపాల్ ప్రభుత్వం కొత్త సోషల్ మీడియా నిబంధనలను అమల్లోకి తెచ్చింది. ఆ కొత్త నిబంధనల్ని అన్ని సోషల్ మీడియా యాప్స్ ఫాలో కావాలని స్పష్టం చేసింది. ఫాలో కావటంతోపాటు అధికారికంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపింది. ఇందుకోసం కొంత సమయం ఇచ్చింది. అయితే, 26 ప్రముఖ సోషల్ మీడియా యాప్స్ నేపాల్ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనల్ని ఫాలో అవ్వలేదు. రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. దీంతో యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఎక్స్, లింక్డ్ఇన్,ఫేస్బుక్, సిగ్నల్‌తోపాటు మరికొన్నిటిని నేపాల్ ప్రభుత్వం బ్యాన్ చేసింది. ఇది అక్కడి జెన్ జీలకు నచ్చలేదు. యాప్స్‌ను బ్యాన్ చేయటంతోపాటు దేశంలో అవినీతి పెరిగిపోయిందంటూ వందల మంది యువతీ, యువకులు నిరసనలకు దిగారు.ప్రధాని కేపీ శర్మ రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
…………………………………………….
