* బలమైన మాధ్యమంగా సోషల్ మీడియా
* అది లేకుంటే బతకలేని స్థితికి ప్రజలు
* సోషల్ మీడియా బ్యాన్‌తో రగిలిపోయిన ఖాట్మాండు యువత
* అది మంచిదేనా? ముప్పుగా పరిణమించనుందా?
* అసలు అక్కడి ప్రభుత్వం ఎందుకు బ్యాన్ చేసింది..
* అంతటి ఉద్రిక్తతలకు కారణాలేంటి?
ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ
తరచూ భూకంపాలతో ఊగిపోయే నేపాల్.. మూడు రోజులపాటు అక్కడి యువత, ప్రజల ఆగ్రహజ్వాలలతో అట్టుడుకుపోయింది. ఆగ్రహ జ్వాలలతో సెగలు కక్కింది. నిరుద్యోగమో, ధరలు పెరగడమో వారి ఆగ్రహానికి కారణం కాదు. సోషల్‌మీడియా యాప్ లను అక్కడి ప్రభుత్వం నిషేధించడమే. దాని వల్ల ఆయా సంస్థలకు ఎంత నష్టం జరుగుతుందో తెలియదు కానీ.. వాటి వినియోగదారులు మాత్రం అల్లాడిపోయారు. రెండు రోజుల పాటు ఓపిక పట్టి.. మూడో రోజు నుంచి ప్రభుత్వంపై నిప్పులు గక్కడం మొదలుపెట్టారు. రబ్బర్ బుల్లెట్లు, వాటర్ క్యాన్లు, టియర్ గ్యాస్ ఇవేమీ వారి ఆగ్రహాన్ని ఆపలేకపోయాయి. చివరకు భద్రతా దళాలు కాల్పులు జరపాల్సి వచ్చింది. దీని వల్ల ప్రాణ నష్టం కూడా సంభవించింది. సోషల్ మీడియాను నిషేధించడం వల్ల ఇంత తీవ్ర స్థాయిలో ఉద్యమం మొదలుకావడం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
సోషల్ మీడియా ఎలా పెరిగింది..?
సోషల్ మీడియా ప్రారంభ తేదీ అంటూ లేదు. మొదటి నుంచీ రూపాంతం చెందుతూ వచ్చింది. అంచలంచెలుగా అందరినీ తనవైపు తిప్పుకుంటోంది. 1970లలో ఈ-మెయిల్, చాట్ ప్రోగ్రామ్‌లు ప్రారంభమయ్యాయి. 1997లో “సిక్స్ డిగ్రీస్ పేరుతో తొలి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ప్రారంభమైందని నిపుణులు చెబుతున్నారు. ఆ తర్వాత, 2000 ప్రారంభంలో మైస్పేస్ మరియు లింక్డ్ఇన్ వంటివి వచ్చాయి. మైస్పేస్ కు 2004లో ఒక మిలియన్ వినియోగదారులు ఉన్నారు. ఇక ఆ తర్వాత 2004లో ఫేస్బుక్ అందుబాటులోకి వచ్చింది. అది విపరీతమైన నెట్ ఆధారిత వినియోగదారుల ఆదరణ పొందింది. ఆ తర్వాత ట్విట్టర్, టంబ్లర్ వంటి మైక్రోబ్లాగ్ ప్లాట్‌ఫారమ్‌లు ప్రారంభమయ్యాయి. ఏటా సోషల్ మీడియా దినోత్సవాన్ని (జూన్ 30న) కూడా జరుపుకుంటున్నారంటే దాని ప్రాధామ్యం అర్థం చేసుకోవచ్చు.
ప్రపంచ జనాభాలో 67.9 శాతం మంది వినియోగదారులే!
సోషల్‌మీడియా బ్యాన్‌కు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో దాదాపు 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ దేశ హోం మంత్రి రాజీనామా చేయాల్సి వచ్చింది. చివరకు ప్రధాని దిగి రావాల్సి వచ్చింది. తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. అంటే సోషల్ మీడియా ఎంత బలమైన మాధ్యమంగా మారిందో అర్థం చేసుకోవచ్చు. రోజురోజుకూ ఆ మాధ్యమానికి వినియోగదారులు పెరుగుతుండడంతో బలమైన శక్తిగా అవతరించింది. ఫిబ్రవరి 2025 నాటికి, ప్రపంచవ్యాప్తంగా 5.56 బిలియన్ల మంది ఇంటర్నెట్ వినియోగదారులు ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. అంటే ఇది ప్రపంచ జనాభాలో 67.9 శాతం. ఈ మొత్తంలో, 5.24 బిలియన్లు లేదా ప్రపంచ జనాభాలో 63.9 శాతం మంది సోషల్ మీడియా వినియోగదారులు ఉన్నారు. నేపాల్ దాదాపు 2 కోట్ల మంది ఉన్నారు. సోషల్ మీడియా బ్యాన్పై వారిలో మెజారిటీ ప్రజలు స్పందించడం వల్లే ఇంత తీవ్రత పెరిగింది.
బలమైన మాధ్యమంగా రూపాంతరం
ప్రపంచ వ్యాప్తంగా సోషల్ మీడియా బలమైన మాధ్యమంగా మారిపోయింది. ఒకప్పుడు ప్రధాన మీడియాలో వచ్చే వార్తలను సోషల్ మీడియాలో పోస్టు చేసుకుని వైరల్ చేసేవారు. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వార్తలు, సెలబ్రిటీల పోస్టులను ప్రధాన మీడియాలో ప్రచురిస్తున్నారు. సోషల్ మీడియా అనేది ప్రజలు ఆన్లైన్లో కనెక్ట్ కావడానికి, ఆలోచనలు, కంటెంట్ (చిత్రాలు, వీడియోలు, టెక్స్ట్) పంచుకోవడానికి, వర్చువల్ సమావేశాలకు, సంభాషణలకు వేదికగా మారిపోయింది. వినోదం పొందడానికి, వాణిజ్య కార్యకలాపాల నిర్వహణ కూడా దాని చుట్టూ తిరుగుతున్నాయి. Facebook, Instagram, Twitter (X), TikTok, YouTube, WhatsApp వంటివి సోషల్ మీడియా ప్రధాన ప్లాట్‌ఫామ్‌లు గా ఉన్నాయి. బ్లాగ్లు, మైక్రో-బ్లాగ్లు, వికీలు కూడా సోషల్ మీడియాలో భాగమే. సోషల్ మీడియా బ్యాన్ కాగానే నేపాల్ ప్రజలు వ్యాపారాలు తమ ఉత్పత్తులను ప్రచారం చేయడానికి ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించలేకపోయారు. బిజీ జీవితంలో ఒకరినొకరు నేరుగా కలుసుకునే అవకాశం లేకపోవడం, ఆన్లైన్ సంభాషణలు ఆగిపోతాయనే ఆందోళన వారి ఆగ్రహానికి కారణమైంది.
మెదడుపై సోషల్‌మీడియా ప్రభావం
సోషల్ మీడియాను ఎక్కువగా వినియోగించే వ్యక్తుల మెదడు డోపమైన్ అనే రసాయనాన్ని విడుదల చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అది వినియోగదారులకు మంచి అనుభూతిని కలిగిస్తుంది. ప్రతి లైక్, కామెంట్ లేదా షేర్లు వారిని సంతోషంగా ఉంచుతాయి. డోపమైన్ స్థాయిలు పెరిగితే మానసిక ఉల్లాసం, ప్రేరణ కలుగుతుంది. తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు పార్కిన్సన్స్ వంటి వ్యాధులకు దారితీస్తాయి. మీరు ఆనందించే పనులు చేసినప్పుడు డోపమైన్ విడుదల అవుతుంది. ఆ ఆనందాన్ని మళ్లీ మళ్లీ పొందాలనే కోరికను పెంచుతుంది. బ్యాన్ తో అవన్నీ ఆగిపోయినప్పుడు మెదడు డోపమైన్ విడుదల నిలిపివేస్తుంది. దీంతో వినియోగదారుల్లో ఆందోళన లేదా నిరాశకు గురవుతారు. ఆ నిరాశలోనే నేపాల్ ప్రజలు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారని మరికొందరు పేర్కొంటున్నారు. సోషల్ మీడియా.. సోషల్ వయొలెన్స్ గా మారిందని చెబుతున్నారు.
బ్యాన్ చేయడం అంటే సాహసమే
సోషల్ మీడియా బ్యాన్ ను తమ స్వేచ్ఛను హరించడంగా నేపాల్ ప్రజలు భావించారు. తమ వ్యాపార కార్యకలాపాలు, లావాదేవీలు, సోషల్ నెట్ వర్కింగ్‌కు ఎక్కువగా ప్రభుత్వం రద్దు చేసిన యాప్ ల పైనే చాలా మంది ఆధారపడ్డారు. ఖాట్మాండు పోస్ట్ నివేదిక ప్రకారం.. నేపాల్‌లో ఫేస్బుక్ యూజర్లు సుమారు 1.35 కోట్ల మంది, ఇన్‌స్టాగ్రామ్‌ను 36 లక్షల మంది వినియోగిస్తున్నారు. వీరిలో అనేక మంది వ్యాపారాల కోసం సోషల్ మీడియాపై ఆధారపడుతున్నారు. నిషేధం అమలులోకి రాగానే వారి కార్యకలాపాలు నిలిచిపోవడం ఆగ్రహాన్ని తెప్పించింది. దీంతో వారందరూ వీధుల్లోకి వచ్చి నిరసన మొదలుపెట్టారు. ఈ ఆందోళన క్రమంగా అవినీతి వ్యతిరేక ఉద్యమంగా మారింది. దాదాపు 26 సోషల్ మీడియా యాప్‌లు శుక్రవారం నుంచి నిలిచిపోవడంతో యువతలో ఆక్రోషం పెల్లుబికింది. సోమవారం ఉదయం రాజధాని కాఠ్మాండూలో మొదలైన ఆందోళనలు.. నేపాల్‌లోని ఇతర ప్రాంతాలకు వ్యాపించాయి. దీంతో అనేక ప్రాంతాల్లో కర్ఫ్యూ ప్రకటించిన పోలీసులు.. ఆందోళనకారులను అడ్డుకున్నారు. సోషల్ మీడియా లేకుంటే బతుకే లేదన్నట్లుగా అక్కడి ప్రజలు కర్ఫ్యూ ని సైతం లెక్కచేయకుండా ఆందోళనల్లో పాల్గొన్నారు.
బ్యాన్‌కు అసలు కారణాలేంటంటే..
నేపాల్ ప్రభుత్వం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ సహా పలు సోషల్ మీడియా సైట్లను గురువారం నిషేధించింది. సమాచార, ప్రసార సాంకేతిక మంత్రిత్వశాఖ వద్ద ఆయా సంస్థలు రిజిస్ట్రేషన్ చేయకపోవడం దీనికి కారణమని ప్రభుత్వం పేర్కొంది. ఆగస్టు 28 నుంచి ఒక వారం గడువు ఇచ్చినా మెటా (ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్), ఆల్ఫాబెట్ (యూట్యూబ్), ఎక్స్ (ట్విట్టర్), రెడిట్, లింక్డ్ఇన్ వంటి సంస్థలు దరఖాస్తులు సమర్పించలేదని తెలిపింది. గతేడాది సుప్రీంకోర్టు ఆదేశాల ఆధారంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియా సంస్థలు నేపాల్‌లో తమ సంప్రదింపుల కేంద్రాన్ని ఏర్పాటు చేసి, స్థానిక ఫిర్యాదు పరిష్కార అధికారి, కంప్లైయెన్స్ అధికారి పేర్లు ఇవ్వాలని ఆదేశించింది. బ్యాన్ పై ఆయా సంస్థలు తక్షణం స్పందించకపోయినా, ప్రజలు వెంటనే రియాక్ట్ అయ్యారు. ఎందుకంటే వీరిలో అనేక మంది వ్యాపార, ఇతర అవసరాల కోసం సోషల్ మీడియాపై ఆధారపడడమే. నిషేధం అమలులోకి రాగానే ప్రభావితమైనవారు వీధుల్లోకి వచ్చి నిరసన మొదలుపెట్టారు. ఈ ఆందోళన క్రమంగా అవినీతి వ్యతిరేక ఉద్యమంగా మారింది.
……………………………………………….
