
* నేడు చాకలి ఐలమ్మ వర్ధంతి
ఆకేరు న్యూస్ డెస్క్ : ఆమె మహిళా చైతన్యానికి ప్రతిరూపం.. అన్యాయంపై తిరుగుబాటుకు చిరునామా.. భూర్జువా వ్యవస్థ పై పోరాడిన వీర వనిత.. గడీలనే గడగడలాడించింది.. ప్రతిఘటనకు స్ఫూర్తిగా నిలిచింది..ఆ పేరు వింటేనే మనలో చైతన్యం వస్తుంది.. ఆమె ఎవరో కాదు చాకలి ఐలమ్మ.. ఝాన్సీ రాణి , రాణి రుద్రమ, రాణి దుర్గావతి, చిత్తూరు చెన్నమల వంటి వీర మహిళల వారసురాలిగా చాకలి ఐలమ్మను తెలంగాణ ప్రజలు పిలుచుకుంటారు. ఝాన్సీ రాణి , రాణి రుద్రమ,రాణి దుర్గావతిలు రాజ్యపాలన చేస్తూ పెద్ద ఎత్తున సైనిక బలగాలతో అనునిత్యం శత్రురాజులతో తలపడి వీర విహంగాలుగా యుద్ధభూమిలో తిరుగాడారు. కానీ, చాకలి ఐలమ్మ ఒంటరి పోరాట యోధురాలు.. ఆమె యుద్ధభూమి సాగు భూమి ఆమె ఆయుధం దుడ్డుకర్ర…
ఐలమ్మ పుట్టింది అతి పేద కుటుంబంలో రెండవ కూతరుగా జన్మించింది. సెప్టెంబరు 26, 1895న జన్మించింది. తండ్రి సాయిలు, తల్లి మల్లమ్మ ఐలమ్మ అక్కకు పదమూడేళ్ల వయసులోనే వివాహం చేశారు. కానీ పెళ్లి కొడుకు కాళ్ల పారాణి ఆరకముందే చనిపోయాడు. అప్పటి సాంప్రదాయం ప్రకారం ఆమె జీవితాంతం విధవగానే ఉండిపోయింది.
చాకలి ఐలమ్మ చిన్ననాటి నుండే చురుకైన స్వభావం .. ఇతరుల బాధలు చూసి చలించే మనస్తతత్వం.. ఆపదలో ఉన్న వారిని ఆదుకునే గుణం.. చాకలి ఐలమ్మచిన్నపుడు ఓ సంఘటన జరిగింది. ఆ రోజుల్లో దళితులను అంటరాని వారుగా చూసే వారు. వారిని ముట్టుకునే వారు కాదు.. ఓ రోజు ఓ దళిత వృద్ధడు ఎండకి తట్టుకోలేక కళ్లు తిరిగి కింద పడితే చుట్టు పక్కల వాళ్లు పట్టించుకోకపోతే చిన్నారి ఐలమ్మ వెంటెనే గ్లాసులో నీళ్లు తెచ్చి అతడికి తాగించి లేచి కూర్చోబెడుతుంది. ఆ రోజుల్లో ఇలా చేసే ధైర్యం ఎవరికీ ఉండేది కాదు..ఈ ఒక్క సంఘటనే చాకలి ఐలమ్మ అంటే ఏమిటో రుజువు చేస్తుంది.
చిట్యాల ఐలమ్మ ఎలా అయింది..
చాకలి ఐలమ్మ ను చిట్యాల ఐలమ్మ గా కూడా పిలుస్తారు. చిట్యాలకు చెందిన నర్సయ్యను పెళ్లి చేసుకుంది, ఆ విధంగా ఆమెను చిట్యాల ఐలమ్మ అని కూడా పిలిస్తారు. చాకలి ఐలమ్మ దంపతులకు ఐదుగురు సంతానం కలిగారు. నలుగురు కొడుకులు, ఓ కూతురు. ఐతే ఇద్దరు కొడుకులు పసితనంలోనే చనిపోయారు.
చాకలి ఐలమ్మ పోరాటాలకు కారణాలు
ఆ రోజుల్లో చాలా తక్కు వ మందికి చిన్నా చితకా భూములు ఉండేవి. వందల వేల ఎకరాలు భూస్వాముల చేతుల్లో ఉండేవి. పటేల్ పట్వారీ వ్యవస్థలు ఉండేవి, దొరల అడుగులకు మడుగులొత్తుతూ వారు బడుగు వర్గాల వద్ద శిస్తు వసూలు చేస్తూ పీడించుకు తినేవారు. చాకలి ఐలమ్మ ఆలోచనా ధోరణి చైతన్యశీలంగా ఉండేది. తాము కూడా కొద్దిగా భూమి కౌలుకు తీసుకొని సేధ్యం చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చిందిజ. తనకు వచ్చిన ఆలోచనను భర్త నర్సయ్యతో పంచుకుంది. దీంతో ఇద్దరు కలిసి మల్లంపల్లి దొర ఉత్తమరాజు కొండలరావును కలువగా ఆయన నాలుగు ఎకరాలు కౌలుకు ఇవ్వడానికి అంగీకరిస్తారు. ఈ విషయం తెలుసుకున్నవిసునూర్ దేశ్‌ముఖ్ రాపాక రాంచంద్రారెడ్డి అగ్గిమీద గుగ్గిలం అవుతాడు. చాకలి కులానికి చెందిన ఓ మహిళ భూమి సాగు చేయడాన్ని తట్టుకోలేక పోతాడు. అప్పటి నుంచి చాకలి ఐలమ్మ కుటుంబాన్ని నానా రకాలుగా హింసలకు గురిచేస్తాడు. చాకలి ఐలమ్మ భర్త నర్సయ్య ఇద్దరు కొడుకులపై తనకున్న పలుకుబడితో పోలీస్ స్టేషన్లలో రకరకాలుగా కేసులు బనాయించి హింసలకు గురిచేస్తాడు. అయినా
పాలకుర్తిలో 40 ఎకరాల భూమి ఉండగా ఐలమ్మ కౌలుకు తీసుకుంది. కొండల్ రావు తల్లి జయప్రదా దేవి ఐలమ్మకూ భూమి సాగు చేసుకునేందుకు అనుమతి ఇచింది. ఆ భూమిలో నాలుగు ఎకరాలు సాగుచేశారు. పాలకుర్తి పోలీస్ పటేల్ వీరమనేని శేషగిరిరావుకు ఐలమ్మ కుటుంబానికి విరోధం ఏర్పడింది. జీడి సోమనర్సయ్య నాయకత్వంలో ఆంధ్రమహాసభ ఏర్పడింది. ఐలమ్మ ఆ సంఘంలో సభ్యురాలు. పాలకుర్తి పోలీస్ పటేల్ శేషగిరిరావు ఐలమ్మను కుటుంబంతో వచ్చి తన పొలంలో పనిచేయాలని ఒత్తిడి చేయడంతో పనిచేయడానికి నిరాకరించింది. పాలకుర్తి పట్వారీ పప్పులుడకక అయిలమ్మ కుటుంబం కమ్యూనిస్టుల్లో చేరిందని విసునూర్ దేశ్‌ముఖ్ రాపాక రాంచంద్రారెడ్డికి ఫిర్యాదు చేశాడు. కేసులో అగ్రనాయకులతో పాటు అయిలమ్మ కుటుంబాన్ని ఇరికించారు. అయినప్పటికీ న్యాయస్థానంలో తీర్పు దేశ్‌ముఖ్‌కు వ్యతిరేకంగా వచ్చింది.
అయిలమ్మ కుటుంబాన్ని ఆర్థికంగా దెబ్బతీస్తే సంఘం పట్టు కోల్పోతుందని భావించిన దేశ్‌ముఖ్,పోలీస్ పటేల్ ను పిలిపించుకొని, అయిలమ్మ కౌలుకు తీసుకున్న ఉత్తమరాజు జయప్రదా దేవి భూమిని తన పేరున రాయించుకున్నాడు. భూమి తనదని, వండించిన ధాన్యం తనదేనని పంటను కోసుకురమ్మని వందమందిని దేశ్‌ముఖ్ పంపాడు. ఆంధ్రమహాసభ కార్యకర్తలు వరిని కోసి, వరికట్టం కొట్టి ధాన్యాన్ని ఐలమ్మ ఇంటికి చేర్చారు. భీంరెడ్డి నరసింహారెడ్డి, ఆరుట్ల రాంచంద్రారెడ్డి, చకిలం యాదగిరిలు సైతం ధాన్యపు బస్తాలను భుజాలపై మోసారు. కొండా లక్ష్మణ్ బాపూజీ సహకారంతో ఐలమ్మకు అనుకూలంగా తీర్పువచ్చింది. రజాకార్ల ఉపసేనాధిపతి అయిన దేశ్‌ముఖ్ రెండుసార్లు పరాజయం పాలయ్యాడు. ఐలమ్మ ఇంటిని కూడా తగులబెట్టారు. ధనాన్ని, ధాన్యాన్ని ఎత్తుకెళ్లారు. ఐలమ్మ కూతురు సోమనర్సమ్మపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఐలమ్మ కుమారులు ముగ్గురు, పాలకుర్తి కమ్యునిష్టు నాయకత్వం ఇంటిని కూల్చి అదే స్ధలంలో మొక్కజొన్న పంటను పండించారు. అనేక రకాలుగా నష్టపోయినప్పటికీ అయిలమ్మ కుటుంబం ఎరజ్రెండాను వీడలేదు.
ఈ దొరగాడు ఇంతకంటే ఇంక నన్ను ఏ విధంగా నష్టపెట్టగలడు’ అని తనలో తాను ప్రశ్నించుకొన్నది. నీ దొరోడు ఏం చేస్తాడ్రా’ అని మొక్కవోని ధెైర్యంతో రోకలి బండ చేతబూని గూండాలను తరమి కొట్టింది. కాలినడకన వెళ్లి దొరకు సవాలు విసిరింది. అయిలమ్మ భూపోరాటం విజయంతో పాలకుర్తి దొర ఇంటిపై కమ్యూనిస్టులు దాడిచేసి ధాన్యాన్ని ప్రజలకు పంచారు. అలాగే 90 ఎకరాల దొర భూమిని కూడా ప్రజలకు పంచారు. అయిలమ్మ భూపోరాటంతో మొదలుకొని సాయుధ పోరాటం చివరి వరకు నాలుగు వేలమంది ఉత్పత్తి కులాల వారు అమరులయ్యారు. 10 లక్షల ఎకరాల భూమి పంపకం జరిగింది.
మరణం
ప్రజా పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచిన ఐలమ్మ సెప్టెంబర్ 10, 1985 న అనారోగ్యంతో మరణించింది. పాలకుర్తిలో ఐలమ్మ స్మారక స్థూపం, స్మారక భవనాన్ని సీపీఎం వారు ప్రజల విరాళాలతో నిర్మాణం చేశారు. వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో 2015 సెప్టెంబరు 10న పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో ఐలమ్మ కాంస్య విగ్రహాన్ని సీపీఎం పోలిట్ బ్యూరో సభ్యురాలు బృందకారత్ ఆవిష్కరించారు.
అధికారికంగా జయంతి వేడుకలు
తెలంగాణ రైతాంగ పోరాటంలో వీరవనితగా గుర్తింపు పొందిన ఐలమ్మ జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించి 2022 సెప్టెంబరు 22న ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు తెలంగాణ వాషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్ నుంచి రూ.10 లక్షలు కూడా మంజూరు చేసింది. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉత్సవాల నిర్వహణకు ఇద్దరు చైర్మన్లు, 25 మంది వైస్చైర్మన్లు, 30 మంది కన్వీనర్లు, 19 మంది కోకన్వీనర్లతో ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేసింది.
……………………………………………………………………