* రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణలో ఉన్నత విద్యనభ్యసించే విద్యార్థుల హాజరు నమోదుకు రేవంత్ సర్కార్ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టబోతుంది. ఇకపై డిగ్రీ, పీజీ విద్యార్థుల హాజరుకు సంబంధించి ఫేషియల్ రికగ్నైజేషన్ విధానాన్ని అమలు చేయనున్నారు. ఇప్పటికే పాఠశాలల్లో అమలవుతున్న ఈ విధానాన్ని ఉన్నత విద్యాసంస్థల్లోనూ ప్రవేశపెట్టనున్నారు. దీంతో డుమ్మా చదువులకు ఫుల్స్టాప్ పడనుంది. త్వరలోనే ఇది అమల్లోకి రానుంది. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. విద్యాశాఖ అధికారులతో జరిపిన సమీక్షా సమావేశంలో డిగ్రీ, పీజీ విద్యార్థుల హాజరుకు సంబంధించి ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ (ఎఫ్ఆర్ఎస్) అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో సీఎం ఆదేశాల అమలుకు హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చర్యలు ప్రారంభించింది. ఈక్రమంలో హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్.. శుక్రవారం నాడు కౌన్సిల్ ఆఫీసులో రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల వీసీలతో సమావేశం కానున్నారు. ఈ మీటింగ్‌లో ప్రధానంగా విద్యార్థులకు ఎఫ్ఆర్ఎస్ విధానం హాజరు అమలు చేయాలనే అంశంపై చర్చించనున్నారు. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా ఉన్న సర్కారు పాఠశాలలు, కాలేజీల్లో విద్యార్థులతో పాటు టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్‌కి కూడా ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ విధానం అమలు చేస్తున్నారు.
……………………………………..
