* ఒక్క అవినీతి మరకా లేని మోదీ
* ఎవరు కావాలో తెలంగాణ ప్రజలు తేల్చాలి
* ఆటంబాంబ్‌కు భయపడి పీఓకేను పాకిస్తాన్‌కు అప్పగిస్తామా?
* తెలంగాణలో ఆర్ ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు
* కాంగ్రెస్, బీఆర్ ఎస్ రెండూ ఒక్కటే
* రిజర్వేషన్లపై రేవంత్ రెడ్డిది అబద్దపు ప్రచారం
* వికారాబాద్ సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా
ఆకేరు న్యూస్, వికారాబాద్ : కొంచెం వేడి ఎక్కువైతే ఫారిన్ టూర్లకు వెళ్లే రాహుల్‌గాంధీ ఒకవైపు, ఒక్క అవినీతి మరకా లేని నరేంద్ర మోదీ ఒకవైపు అని, ఎవరు కావాలో తెలంగాణ ప్రజలు తేల్చుకోవాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. దీపావళి రోజున కూడా సెలవు తీసుకోకుండా పని చేసిన వ్యక్తి మోదీ అని పేర్కొన్నారు. వికారాబాద్ లో నిర్వహించిన బీజేపీ ఎన్నికల ప్రచారంలో రేవంత్, రాహుల్ పై విమర్శలు గుప్పించారు. సర్జికల్ స్ట్రైక్స్ ను రేవంత్ రెడ్డి ఎగతాళి చేస్తున్నారని, సర్జికల్ స్ట్రైక్స్ ద్వారా మూలనదాక్కున్న ఉగ్రవాదులను మట్టుబెట్టామని చెప్పారు. సర్జికల్ స్ట్రైక్స్ చేసే ధైర్యం కాంగ్రెస్ కు లేదని ఎద్దేవా చేశారు. పాకిస్తాన్ వద్ద ఆటంబాంబ్ ఉన్నదని కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ భయపడుతున్నారని, బాంబు ఉందని పీఓకేను పాకిస్తాన్‌కు అప్పగిస్తామా అని ప్రశ్నించారు. బీజేపీ ఉన్నంత వరకూ పీఓకేని పాకిస్తాన్‌కు అప్పగించడం ఎవరికీ సాధ్యం కాదన్నారు. ఉగ్రావాదాన్ని అంతం చేసే ప్రధాని కావాలా, వాళ్లను రక్షించే వాళ్లు కావాలా అన్నారు. కశ్మీర్ మనదేనా, కాదా అని తెలంగాణ ప్రజలు చెప్పాలన్నారు.
ముస్లిం రిజర్వేషన్లు రద్దు
రామమందిరంలో ప్రాణప్రతిష్టకు రాహుల్, ఖర్గే, ప్రియాంక ఎందుకు రాలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని అమిత్‌షా విమర్శించారు. రిజర్వేషన్ల రద్దుపై రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. బీజేపీకి 400 సీట్లు ఇస్తే.. ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేసి.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు పెంచుతామని వెల్లడించారు. తెలంగాణలో ఆర్ (రేవంత్ రెడ్డి), ఆర్ (రాహుల్ బాబా) ట్యాక్స్ వసూలు చేస్తున్నారని, తెలంగాణను ఏటీఎం కింద వాడుకుంటున్నారని ఆరోపించారు. తెలంగాణ ఖజానాను ఢిల్లీకి తరలిస్తున్నారని విమర్శించారు. అవినీతిలో కాంగ్రెస్, బీఆర్ ఎస్.. రెండూ ఒక్కటే అన్నారు.
—————————–