
* ఎన్ని అడ్డంకులైనా వడ్డీలేని రుణాలిస్తాం
* వెనకడుగు వేసే ప్రసక్తి లేదు
* ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : హైదరాబాద్లోని కోట్ల విజయ భాస్కర రెడ్డి ఇండోర్ స్టేడియంలో శనివారం ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గ్రేటర్ పరిధిలోని స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలను పంపిణీ చేశారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Batti Vikramarka), మంత్రులు పొన్నం ప్రభాకర్(Ponnam prabhakar), సీతక్క, వివేక్ (Vivek) కార్యక్రమానికి హాజరయ్యారు. పొన్నం మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో పదేళ్లుగా రేషన్ కార్డు ఇవ్వలేకపోయారని, తాము కొత్త రేషన్ కార్డులతో పాటు ప్రతీ ఒక్కరికీ 6 కిలోల సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. అత్తగారింటికైనా, అమ్మగారింటికైనా, పండగలకైనా పబ్బాలకైనా ఉచితంగా బస్సుల్లో ప్రయాణం చేసే అవకాశం కల్పించామన్నారు. ప్రతీ ఇంటికీ 200 యూనిట్ల ఉచిత కరెంట్ ను అందిస్తున్నామన్నారు.
కోటీశ్వరులను చేయడమే తమ లక్ష్యం
భట్టి విక్రమార్క మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల్లో ఎంత మంది ఉంటే అందరికీ రుణాలు ఇస్తామన్నారు. ఎన్ని ఇబ్బందులైనా మహిళలకు వడ్డీలేని రుణాలు అందిస్తామన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. వడ్డీలేని రుణాలతో మహిళలు కోటీశ్వరులుగా మారాలని కోరుకుంటున్నా అన్నారు. వడ్డీలేని రుణాలతో మహిళలు వ్యాపారాలు చేయాలన్నారు. రూ.5, 10కు అప్పులు చేయాల్సిన అవసరం లేదన్నారు. మహిళలే కుటుంబాలకు మూల స్థంభాలు లాంటి వారని, వారు ఆర్థికంగా బలంగా నిలబడినప్పుడు ప్రతీ కుటుంబం బలోపేతం అవుతుందని, అదే ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యమన్నారు. పిల్లలను బాగా చదివించి, మిగతా ప్రాంతాల వారికి కూడా తెలంగాణ మహిళలు ఆదర్శంగా నిలవాలని సూచించారు. ఇప్పటి వరకు కరెంటు చార్జీలు పెంచలేదని, అంతేకాకుండా 200 యూనిట్ల లోపు ఉచితంగా కరెంట్ ఇస్తున్నామని మరో సారి గుర్తు చేశారు. డ్వాక్రా సంఘాలకు సంబంధించి ఎటువంటి సమస్యలున్నా, మంత్రి సీతక్క (Seethakka) తో మాట్లాడి పూర్తిగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
……………………………………………