* వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిలో ఆక్రమణల కూల్చివేతలు
* పేదలపై ప్రతాపమా.. బతుకమ్మ పండుగ పూజ ఇదేం దారుణం
* బాధితుల ఆర్తనాదాలు.. బతుకమ్మ ఆడుతూ నిరసలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : మరోసారి హైడ్రా కూల్చివేతలపై తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. హైడ్రా ఉన్నది చెరువుల పరిరక్షణకా.., పేదల ఇళ్లను కూల్చివేయడానికా అంటూ బాధితులు ఆందోళన చేపట్టారు. పండుగ పూటా తమను రోడ్డుపైకి ఈడ్చుతారా అంటూ బతుకమ్మ (BATHUKAMMA) ఆడుతూ ఆవేదన వెలిబుచ్చారు. హైడ్రా మాత్రం తాము 300 ఎకరాల ప్రభుత్వ భూమిని తాము కాపాడామని, రూ.15 వేల కోట్ల విలువ ఉంటుందని పేర్కొంటోంది. హైదరాబాద్లోని గాజుల రామారం లో 300 ఎకరాల ప్రభుత్వ భూములు ఉండగా, అందులో 100 ఎకరాలకుపైగా ప్రభుత్వ భూమిని ఆక్రమించినట్లు హైడ్రా (HYDRA) అధికారులు గుర్తించారు. ఆ ఆక్రమించిన భూమిలో కొందరు 60 నుంచి 70 గజాలు, 80 గజాల పరిమాణంలో ఇళ్లు నిర్మించి, రూ.10 లక్షలకు విక్రయిస్తున్నట్టు పేర్కొన్నారు. ఆదివారం ఉదయం నుంచి అక్రమ నిర్మాల తొలగింపు పనులు చేపట్టిన హైడ్రా అధికారులు నివాసాల జోలికి వెళ్లకుండా ఆక్రమణల తొలగిస్తున్నట్లు చెప్పారు.దీంతో గాజులరామారం(GAJULA RAMAARAM) లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హైడ్రా కూల్చివేతలను వ్యతిరేకిస్తూ స్థానికులు ఆందోళన చేపట్టారు. ఇళ్ల కూల్చివేతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బాధితులు.. తాము కొనుక్కున్న ఇళ్లను కూల్చవద్దని వేడుకున్నారు. బతుకమ్మ పండుగ వేళ ఇళ్లను కూల్చివేయడంపై ఆవేదన వ్యక్తంచేశారు. ఎక్స్ కవేటర్లను అడ్డుకుని ధర్నాకు దిగారు. ఇళ్లను అమ్మినవారిపై చర్యలు తీసుకోవాలని, అమాయక ప్రజలను కాదని అన్నారు. తమ తాతలు, తండ్రులు కూలీనాలీ చేసుకుని పోగు చేసుకున్న సొమ్ముతో ఇక్కడ ఇళ్లు కట్టుకున్నామని తమకు అన్యాయం చేయవద్దని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. బతుకమ్మ పండుగ వేళ ఇళ్లను కూల్చివేయడంపై బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు.
…………………………………………….
